ఉష – అనిరుద్ధుడు ఇద్దరూ కూడా ప్రేమానురాగారక్తులై కాలం గడుపుతుంటారు. తల్లిదండ్రుల ఆలోచన లేక .. ఉద్యానవన విహారాన్ని కూడా మరిచి అనిరుద్ధుడే లోకంగా ఉష ఉంటుంది. ఇక ద్వారక గురించిన ఆలోచనగానీ .. తన భార్య రుక్మలోచన ఆలోచనగాని లేకుండా ఉషనే సర్వస్వము అన్నట్టుగా అనిరుద్ధుడు ఉంటాడు. ఉష శయ్యా మందిరంలోనే ఇద్దరికీ రోజులు మురిపాలతో .. ముచ్చట్లతో గడిచిపోతూ ఉంటాయి. ఈ విషయం మూడో కంటికి తెలియకుండగా చిత్రరేఖ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.
ఇక ద్వారకలో రుక్మలోచన తన భర్తను గురించిన ఆలోచనలతో కన్నీళ్లతోనే కాలం గడుపుతుంటుంది. అసలు ఏం జరిగింది? తన భర్త ఎలా మాయమయ్యాడు? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడా .. లేడా? అనే ఆలోచనలతో ఆమె సతమతమైపోతుంటుంది. ఆమెను అనేక రకాలుగా రుక్మిణీదేవి ఓదార్చుతూ ఉంటుంది. అనిరుద్ధుడిని అన్వేషించే పనులు మరింత వేగవంతం చేయమని ఆమె కృష్ణుడితో చెబుతుంది. రుక్మలోచన ఆవేదనను తాను చూడలేకపోతున్నానని అంటుంది.
ఇదిలా ఉండగా బాణాసురుడు తన మేనల్లుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. తన మనసులోని మాటను భార్యతో చెబుతాడు. ఆయన నిర్ణయానికి ఆమె కూడా సుముఖతను వ్యక్తం చేస్తుంది. దాంతో ఆయన తన ప్రయత్నాలను చకచకా కానిచ్చేస్తూ ఉంటాడు. ఉషకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అనుకుంటున్న విషయమే కనుక, ప్రత్యేకంగా ఆమె ఇష్టాయిష్టాలను గురించి తెలుసుకోవలసిన అవసరం లేదని అనుకుంటాడు. పెళ్లి మాటలకు సంబంధించిన పనులు ఊపందుకుంటాయి.
అనిరుద్ధుడి ప్రేమలో మునిగితేలుతున్న ఉషకు ఈ విషయాలేవీ తెలియదు. అయితే చిత్రరేఖ అంతఃపురంలో తిరుగుతూ ఉంటుంది కనుక, ఆమెకి ఈ విషయం తెలుస్తుంది. దాంతో ఆమె పరుగు పరుగున ఉష మందిరానికి చేరుకుని, ఆమె పెళ్లికి సంబంధించిన పనులతో తండ్రి తీరికలేకుండా ఉన్నాడని చెబుతుంది. ఆ మాటలకు ఉష ఆందోళన చెందుతుంది. తండ్రికి అసలు విషయం చెప్పవలసిన పరిస్థితి .. చెబితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకూ ఆనందంగా .. హాయిగా సాగిన రోజులు ఇక ముందు ఎలా ఉండనున్నాయా అని ఆమె కంగారుపడుతూ ఉంటుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.