Varijala Venugopala Swamy Temple
తెలంగాణ ప్రాంతంలో నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ఎక్కువ. అలాగే కాకతీయల కాలంలో నిర్మితమైన శివాలయాలు ఎక్కువ. స్వయంభువుగా శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన క్షేత్రాలు మాత్రం తక్కువేనని చెప్పాలి. అందునా కొండపై స్వామివారు వెలసిన క్షేత్రాలు మరింత తక్కువగా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాలలో “వారిజాల వేణుగోపాలస్వామి”(Varijala) క్షేత్రం ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది నల్గొండ జిల్లా .. నార్కెట్ పల్లి సమీపంలో గోపాలపల్లి మండలం పరిధిలో కనిపిస్తుంది.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళుతూ ఉండగా, రహదారికి కొంత దూరంలో గల కొండపై ఈ ఆలయం కనిపిస్తూనే ఉంటుంది. ఈ కొండను చూడగానే మిగతా కొండలకి భిన్నంగా కనిపిస్తూ .. భగవంతుడి నివాసానికి అనుకూలమైన రీతిలో తన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. కొండపై భాగంలో కనిపించే ఆలయం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. కొండపైకి చేరుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. ఈ కొండ శిఖరాన .. దిగువన కూడా వేణుగోపాలస్వామి ఆవిర్భవించడం విశేషం.
పూర్వం ఈ కొండపై మునులు తపస్సు చేసుకునేవారట. అందువలన ఇప్పటికీ దీనిని మునులకొండ అనే పిలుస్తుంటారు. అప్పట్లో ఈ కొండపైకి చేరుకోవడం సామాన్యుల వలన అయ్యేది కాదు. తన భక్తులు కొండపై భాగం వరకూ రాలేకపోతున్నారని భావించిన శ్రీకృష్ణుడు .. కొండ దిగువ భాగంలోను వెలిశాడని గ్రామస్తులు చెబుతారు. కొండ శిఖర భాగం నుంచి స్వామివారు దిగువకు రావడానికి వేసిన అడుగు .. కొలనుగా మారిందని అంటారు. శిఖరం పై భాగంలోను ఒక కోనేరు ఉందని చెబుతారు.
ఈ కోనేరులో తామరపూలు వికసిస్తూ ఉంటాయి .. “వారి” అంటే నీరు అని అర్థం. “వారిజము” అంటే తామర అని అర్థం. తామరపూలతో కూడిన కొలను సన్నిధిలో ఆవిర్భవించిన కారణంగా ఇక్కడ స్వామివారిని “వారిజాల వేణుగోపాలుడు”గా(Varijala) కొలుస్తుంటారు. ఇక దిగువున ఉన్న కోనేరులో నీటిని తీర్థంగా స్వీకరించడం వలన సమస్త వ్యాధులు .. బాధలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. పుట్టలో నుంచి స్వామివారు వెలుగు చూసినట్టుగా స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడ వెలుగు చూసిన ఆండాళ్ అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. గోపాలపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కొండపై గల ఇతర మందిరాలలో పార్వతీ సమేత రామలింగేశ్వరుడు .. సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తూ ఉంటారు. ఎత్తైన ఈ కొండపై నుంచి చూస్తే చుట్టూ పక్కల ప్రదేశాలన్నీ కనిపిస్తూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. శివకేశవులను మోస్తున్న అంబారీలా ఈ కొండ దర్శనమిస్తూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Varijala Venugopala Swamy Temple