Vedadri Sri Lakshmi Narasimha Swamy Temple

సాధారణంగా ఏదైనా ఒక క్షేత్రానికి అక్కడి స్వామిపేరుగానీ .. స్వామివారు ఆవిర్భవించడానికి కారణమైన మహర్షుల పేరుగానీ .. స్వామివారిని మెప్పించిన మహాభక్తుల పేరుగాని ఉంటుంది. కానీ వేదాల పేరుతో ఏర్పడిన క్షేత్రం మరెక్కడా కనిపించదు. వేదాలే రాశిగా .. కొండగా ఏర్పడిన క్షేత్రంగా “వేదాద్రి”(Vedadri) కనిపిస్తుంది. ఇక్కడి ప్రధానమైన దైవం లక్ష్మీనరసింహస్వామి. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేటకి సమీపంలో .. కృష్ణానదీ తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. శ్రీమహావిష్ణువు మత్స్య అవతారాన్ని ధరించడమనే ఘట్టంతో ముడిపడి ఉండటం ఈ క్షేత్రానికి గల మరో ప్రత్యేకత.

పూర్వం సోమకుడు అనే అసురుడి ఆగడాలకు హద్దులేకుండా పోతుంది. దేవతలు కూడా ఆ రాక్షసుడి ఆగడాలకు అడ్డుకట్టవేయలేకపోతారు. సాధుసజ్జనులను అతను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. దేవతల శక్తి అంతా కూడా వేదాలలోనే ఉందని భావించిన సోమకాసురుడు ఆ వేదాలను బ్రహ్మదేవుడి నుంచి దొంగిలిస్తాడు. తనతో పాటు వేదాలు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో సముద్రగర్భంలో దాక్కుంటాడు. వేదరాశి లేకపోవడంతో లోకంలో అజ్ఞానమనే అంధకారం అలుముకుంటుంది.

దాంతో దేవతలంతా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయిస్తారు. ఈ విపత్తు నుంచి సమస్త లోకాలను బయటపడేయవలసిన బాధ్యత స్వామిదేనని అంటారు. దాంతో బ్రహ్మదేవుడి నుంచి వేదాలు మాయం కావడానికి సోమకాసురుడు కారణమనే విషయాన్ని నారాయణుడు గ్రహిస్తాడు. అతను సముద్రగర్భంలో దాక్కున్నాడనే విషయం తెలిసిపోతుంది. వేదాలను రక్షించాలంటే తాను మత్స్య అవతారాన్ని ధరించవలసి ఉంటుందంటూ, స్వామివారు మత్స్య రూపాన్ని ధరిస్తాడు. సోమకాసురుడి కోసం సముద్రగర్భంలో ప్రవేశిస్తాడు.

సోమకాసురుడు తనవైపు దూసుకొస్తున్న చేప నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. స్వామివారు తన మత్స్య రూపాన్ని పెంచుతూ ముందుకు వెళుతుంటాడు. చివరికి ఆ మత్స్య రూపం సముద్రం మొత్తాన్ని ఆక్రమిస్తుంది. దాంతో సోమకాసురుడు తప్పించుకునే మార్గం లేకుండా పోతుంది. స్వామి ఆ అసురుడిని అంతం చేసి .. వేదాలను తన శిరస్సున పెట్టుకుని ఒడ్డుకు తీసుకుని వస్తాడు. తాము స్వామి సన్నిధిలోనే ఉంటామని వేదాలు కోరడంతో, తాను నరసింహస్వామిగా ఆవిర్భవించినప్పుడు వాటి కోరిక తీరుతుందని మాట ఇచ్చాడట.

ఆ తరువాత కాలంలో వేదరాశి కొండగా మారగా .. ఈ కొండ పరిధిలో నరసింహస్వామి ఐదు ప్రదేశాలలో ఆవిర్భవించాడు. ఇక్కడి కృష్ణానదీలోను స్వామివారు సాలిగ్రామ శిలగా .. యోగానంద .. లక్ష్మినరసింహ స్వామిగా ఆవిర్భవించారని స్థలపురాణం చెబుతోంది. కొండ నుంచి వేదాలు వెలువడుతుండటం గమించిన మహర్షులు, ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టుగా తెలుసుకున్నారు. కొండ పైభాగంలో స్వామి జ్వాలా నరసింహస్వామిగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా పరమశివుడు కనిపిస్తాడు. ఈ క్షేత్ర దర్శనం వలన అనారోగ్యాలు .. ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Vedadri Sri Lakshmi Narasimha Swamy Temple