Sri Bhagavatam – Balarama’s concern about the extinction of the Yadav dynasty
ద్వారకలో ప్రజలంతా కూడా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. కృష్ణుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అదే సమయంలో బలరాముడు అక్కడికి వస్తాడు. కృష్ణుడు అదోలా ఉండటం చూసి విషయమేమిటని అడుగుతాడు. అప్పుడు గాంధారి పెట్టిన శాపం గురించి కృష్ణుడు ప్రస్తావిస్తాడు. యాదవులంతా నశిస్తారని ఆమె పెట్టిన శాపాన్ని ఆయనకి గుర్తుచేస్తాడు. ఆ మాటలను గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం ఏముందని బలరాముడు అంటాడు.
గాంధారి శపించినట్టుగా తప్పకుండా జరుగుతుందనీ, ఆమె మాటకు విరుద్ధంగా జరిగే అవకాశమే లేదని కృష్ణుడు అంటాడు. కొన్ని రోజులుగా ప్రకృతి శక్తులన్నీ కూడా ద్వారకలో ముంచుకు రానున్న ముప్పును సూచిస్తున్నాయని చెబుతాడు. ద్వారక ప్రజల ధోరణిలో మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోందని అంటాడు. అందువలన గాంధారి శాపం ఫలించడానికి మరెంతో సమయం లేదని తనకి అనిపిస్తోందని అంటాడు. ద్వారక వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం తనకి స్పష్టంగా కనిపిస్తోందని చెబుతాడు.
కృష్ణుడి మాటలను బట్టి యాదవ వంశం నశించడం ఖాయమనే విషయం బలరాముడికి అర్థమైపోతుంది. దాంతో ఆయన ఆలోచనలో పడతాడు. కృష్ణుడితోనూ .. ద్వారకతోను తనకి గల అనుబంధాన్ని తలచుకోగానే బలరాముడి మనసు భారమవుతుంది. అది గమనించిన కృష్ణుడు .. అనవసరమైన విషయాలను గురించి ఆలోచన చేయవద్దని చెబుతాడు. ఎవరినో ఒకరిని కారకులుగా చూపిస్తూ కాలం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని అంటాడు. అందువలన జరగనున్న సంఘటనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమని చెబుతాడు.
జరాసంధుడి బారి నుంచి కాపాడటం కోసం తమ వాళ్లందరిని ద్వారక చేర్చి, వాళ్ల ప్రాణాలను కాపాడుతూ వస్తే ఇలా విధి వాళ్లను ఒక్కసారిగా తుడిచేయడం ఘోరమని బలరాముడు అంటాడు. ఏం జరుగుతుందో తెలియని వాళ్లందరినీ చూస్తుంటే తన మనసంతా అదోలా అవుతుందని చెబుతాడు. జరగనున్న ఘోరాన్ని చూస్తూ తట్టుకోలేనప్పుడూ ముందుగానే శరీర త్యాగం చేయడం మంచిదేమో అనుకుంటూ బలరాముడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వైపు అలా చూస్తుండిపోతాడు కృష్ణుడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Balarama’s concern about the extinction of the Yadav dynasty