Karthika Puranam – 26: The story of Dharmadatta

కార్తీక మాస విశిష్టతను .. వైభవాన్ని .. కార్తీక వ్రత మహాత్మ్యం గురించి తెలుసుకున్న పృథు చక్రవర్తి, ఇంతకుముందు ఎవరెవరూ ఆయా వ్రతాన్ని ఆచరించారో, ఆ వ్రతం విశేషమేమిటో తెలుపవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెడతాడు. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో “ధర్మదత్తుడు” అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా ఆచారవంతుడు … నియమనిష్టలు కలిగినవాడు. కార్తీక మాసాల్లో ఆయన మరింత భక్తిశ్రద్ధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.

కార్తీకంలోని ఒక రోజున ఆయన నదీ స్నానం చేసి దైవ దర్శనానికి వెళుతూ ఉండగా, దిగంబరంగా ఉన్న ఒక రాక్షసి ఎదురవుతుంది. దానిని చూడగానే ఆయన భయపడిపోతాడు. ఆ సమయంలో ఆయన తన తడి జుట్టును సరి చేసుకుంటాడు. అప్పుడు కొన్ని నీటి బిందువులు వెళ్లి ఆ రాక్షసిపై పడతాయి. వెంటనే ఆ రాక్షసి శాంతించి, ధర్మదత్తుడికి వినయంతో నమస్కరిస్తుంది. హఠాత్తుగా ఆ రాక్షసి అలా మారిపోవడంతో ధర్మదత్తుడు ఆశ్చర్యపోతాడు. అతని కారణంగా తనకి పూర్వజన్మ స్మృతి కలిగిందని ఆ రాక్షసి చెబుతుంది.

పూర్వజన్మలో సౌరాష్ట్ర ప్రాంతంలో నేను ఒక బ్రాహ్మణుడికి భార్యగా ఉండేదానిని. అయితే ఎప్పుడూ కూడా భర్తతో గొడవలు పడుతూనే ఉండేదానిని. అందువలన అందరూ కూడా నన్ను “కలహ” అనే పిలిచేవారు. చుట్టుపక్కలవారి విషయంలో నేను చాలా కఠినంగా వ్యవహరించేదానిని. నన్ను మార్చడానికి ఎవరు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. నా భర్తను నేను ఎప్పుడూ ప్రేమగా చూసుకున్నది లేదు .. ఆయన ఆకలితో ఉన్నప్పుడు అనురాగంతో వడ్డించింది లేదు.

దాంతో ఆయన మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియగానే నేను విషం తీసుకుని మరణించాను. నా గురించి ఉన్నది ఉన్నట్టుగా చిత్రగుప్తుడు యమధర్మరాజుకు విన్నవించాడు. దాంతో నాకు అనేక కఠిన శిక్షలను విధించారు. చివరికి ప్రేత శరీరంతో 500 సంవత్సరాలుగా ఆకలితో తిరుగుతూ ఉన్నాను. పుణ్యాత్ముడివైన నీ కారణంగా .. నువ్వు చేసిన కార్తీక నదీ స్నానపు నీటి బిందువులు నాపై పడటం వలన, నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెబుతుంది.

ఇక నేను ఈ ప్రేత శరీరంలో ఉండలేను .. ఈ ప్రేత శరీరం నుంచి విముక్తిని పొందడానికి నేను ఏం చేయాలి? వందల సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి? అని “కలహ” అడుగుతుంది. అందుకు ధర్మదత్తుడు స్పందిస్తూ, పుణ్యకార్యాలను ఆచరించడం వల్లనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి. కానీ ప్రేత శరీరంలో ఉన్న నీకు దానధర్మాలు .. వ్రతాలు .. నోములు ఆచరించే అవకాశం లేదు. అందువలన నీ ప్రమేయంతో .. నీ ప్రయత్నంతో ఈ స్థితి నుంచి విముక్తిని పొందడం సాధ్యం కాదు.

నేను ఆచరించిన కార్తీక వ్రతంలోని కొంత పుణ్యాన్ని నీకు ధారపోస్తాను, అలా చేయడం వలన నీకు విముక్తి లభిస్తుంది అని చెబుతాడు. అందుకు “కలహ” ఆనందిస్తుంది .. ధర్మదత్తుడు కార్తీక వ్రతం చేసిన పుణ్యం నుంచి కొంత పుణ్యాన్ని ఆమెకి ధారపోస్తాడు. ఆ వెంటనే కలహకు ప్రేత శరీరం నుంచి విముక్తి కలుగుతుంది. ఆమె కోసం విష్ణుదూతలు దివ్య విమానంలో వస్తారు. ఎవరో తెలియని ఒక స్త్రీ కోసం ఆయన పుణ్యంలో కొంత ధారపోసినందుకు ధర్మదత్తుడిని విష్ణు దూతలు అభినందిస్తారు.

ధర్మదత్తుడు చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆయనకి తన ఇద్దరి భార్యలతో పాటు విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని అంటారు. ఆయన చేసిన ఈ పుణ్యకార్యం వలన ఆ తరువాత కాలంలో ఆయన దశరథ మహారాజుగా జన్మిస్తాడని చెబుతారు. ఆయన భార్యలు ఇద్దరూ కూడా మళ్లీ ఆయనతోనే జీవితాన్ని పంచుకుంటారని అంటారు. ఇక ఆయనచే ముక్తిని పొందిన కలహ కూడా అప్పుడు ఆయనకి మూడో భార్య అవుతుందని చెబుతారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయనకి కొడుకుగా పుడతాడని అంటారు.

ఓ పృథు మహారాజా .. చూశావా? కార్తీకవ్ర్రతాన్ని ఆచరించడం వలన వచ్చే పుణ్యం కొంత ధారపోయడం వల్లనే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందంటే, ఈ వ్రతం ఎంతటి శక్తిమంతమైనదో .. మరెంతటి మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కార్తీక వ్రతాన్ని ఆచరించే అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకూడదు అని పృథు చక్రవర్తితో నారద మహర్షి చెప్పుకొస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

Karthika Puranam – 26: The story of Dharmadatta