ఓ విష్ణు దూతలారా .. భూలోక వాసులంతా ఎంతగానో దానధర్మాలు చేస్తున్నారు. నోములు – వ్రతాలు ఆచరిస్తున్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది? దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు. అప్పుడు విష్ణు దూతలు “ధర్మదత్తా .. ఆ విషయం తెలుసుకోవాలంటే, ఇప్పుడు మేము చెప్పబోయే కథను వినాలి … విను అని చెప్పడం మొదలుపెడతారు.

పూర్వం .. కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆ సమయంలో “విష్ణుదాసు” అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకుని, తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు.

అది చూసిన చోళరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి. తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే, వాటిని కప్పివేసేలా తులసి దళాలతో పూజ చేస్తావా? అని విష్ణుదాసుపై మండిపడతాడు. పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్లలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది? అంటూ హేళనగా మాట్లాడతాడు. ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో .. తాను అది ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాసు అంటాడు.

పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి .. యజ్ఞాలు … యాగాలు చేయాలి. నువ్వు చేయగలవా? అంటూ చోళుడు దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడిని అని ఆ రాజు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాడు. ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడి వాళ్లందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా, రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు.

విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో, చోళరాజు “గయ” క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దానధర్మాలు చేస్తూ .. యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యం ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ .. కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ, ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి, భోజనం చేయాలనుకుంటాడు.

అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది .. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్లివుంటారు? అని ఆలోచన చేస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయడం .. ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావడం జరుగుతూ ఉంటుంది.

అలా వారం రోజుల పాటు జరుగుతుంది .. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఆ రోజున ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తాడు. అప్పుడు ఒక ఛండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్నం పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు, గభాలున పైకి లేస్తాడు. “నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు” అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు.

విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా .. ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ ఛండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనని పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పనిలేదనీ, ఆయన తినే అన్నంలోకి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆ ఛండాలుడు చిరుమందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు.

అప్పటివరకూ ఛండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా, వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి బయల్దేరతాడు. అలా వెళుతున్న ఆ విమానాన్ని “గయ” క్షేత్రంలోని చోళుడు చూస్తాడు.

ఓ మారుమూల ఊళ్లోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు, స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు. తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న “గయ” క్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకూ స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనని గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృథాగా భావించి, రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తుండగానే అగ్ని ప్ర్రవేశం చేస్తాడు.

చోళుడు హోమగుండంలోకి అడుగుపెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తుండగానే, చోళుడిని స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. ఇదంతా విన్న తరువాత నీకు ఏం అర్థమైందని విష్ణుదూతలు ధర్మదత్తుడిని అడుగుతారు. శ్రీమహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకి కావలసినది అంకితభావం .. అంచెంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.