పరమశివుడిని నియంత్రించడం కోసం జలంధరుడు “మాయ గౌరీ”ని సృష్టిస్తాడు. ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్టుగా శివుడికి చూపుతాడు. ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతనుడై పోతాడు. అదే అదనుగా భావించిన జలంధరుడు, శివుడిపై విరుచుకుపడటానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు .. జరుగుతున్నదంతా రాక్షస మాయ అని గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేచేలా చెప్పి చైతన్యవంతుడిని చేస్తాడు. దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడిగా మారిపోతాడు.

మహోగ్రమైన ఆ రూపాన్ని చూడలేక అసురులంతా తలో దిక్కుకు పారిపోవడం మొదలుపెడతారు. తన సైన్యం చెల్లాచెదురు కావడం చూసిన జలంధరుడు, పరమశివుడిపైకి దూసుకువస్తాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధరుడు పన్నుతున్న మాయోపాయాలను క్షణాల్లో శివుడు నిర్వీర్యం చేస్తూ ఉంటాడు. శివుడికి సహకరించబోయిన నందీశ్వరుడు, జలంధరుడి ధాటికి తట్టుకోలేకపోతాడు. అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని భావించి “సుదర్శన చక్రం” వదులుతాడు.

సుదర్శన చక్రం జలంధరుడి శిరస్సును ఖండించి వేస్తుంది. ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది. దానవులంతా అక్కడి నుంచి పారిపోగా, దేవతలంతా స్వామిని కీర్తిస్తారు. ఆ తరువాత వాళ్లు విష్ణుమూర్తిని గురించిన ఆలోచన చేస్తారు. జరిగింది తెలుసుకుని “బృంద” దగ్గరికి వెళతారు. అగ్నిలో దూకి ఆమె ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం .. ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు. అప్పుడు అందరూ కలిసి “మహామాయ”ను కొలుస్తారు.

దేవతలంతా ప్రార్ధించడంతో మహామాయ ప్రత్యక్షమవుతుంది. తన అంశావతారాలైన లక్ష్మీదేవి … పార్వతీ దేవి .. సరస్వతిని ప్రార్ధించమని సెలవిస్తుంది. దేవతలంతా ఆ త్రిమాతలను సేవిస్తారు. అప్పుడు ఆ ముగ్గురూ ప్రత్యక్షమై, వికలమైన మనసుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇచ్చారు. దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు. ఆ బీజాల నుంచి తులసి .. మాలతి .. ఉసిరిక పుట్టుకు వస్తాయి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి, ముందుగా తులసిని చూసి మురిసిపోయాడట. అలా స్వామికి తులసి ప్రీతికరమైపోయింది అని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతాడు.

అంతేకాదు .. తులసి యొక్క మహిమను .. దాని విశిష్టతను చెబుతాను .. విను … అంటూ నారద మహర్షి . పృథు చక్రవర్తితో చెప్పడం మొదలుపెడతాడు. తులసిని దర్శించడం వలన .. సేవించడం వలన .. అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు. గంగా స్నానం .. నర్మదా దర్శనం .. తులసి సేవనం సమానమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలవుతాయి. పుణ్యనదులు .. దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి. అందువలన తులసిని పూజించడం వలన, వాళ్లందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీమహా విష్ణువును పూజిస్తారో వాళ్లంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు. ఇక కార్తీకంలో దేవతలు .. మహర్షులు ఉసిరికాయలను ఆశ్రయించి ఉంటారు. అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణుపూజలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.

కార్తీకమాసంలో ఎవరైతే ఉసిరిచెట్టుక్రింద భోజనం చేస్తారో వాళ్ల పాపాలు ధ్వంసమవుతాయి. ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయను కోస్తారో వాళ్లు నరకంలో నానా శిక్షలు అనుభవిస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన, ప్రత్యక్ష నారాయణుడిని సేవించిన ఫలితం లభిస్తుంది. ఇలా కార్తీకంలో ఉసిరిక .. విష్ణుపూజలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది అంటూ పృథు చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.