Yadagirigutta Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీనమైన నరసింహస్వామి క్షేత్రాలలో “యాదగిరి గుట్ట” ముందువరుసలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్షేత్రాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశారు. “యాదాద్రి”(Yadadri) జిల్లా కేంద్రంగా కొత్త రూపురేఖలను సంతరించుకుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం .. లక్ష్మినరసింహస్వామి క్షేత్రంగా విలసిల్లుతోంది. స్వామివారు ఇక్కడి గుట్టపై దర్శనమిస్తూ ఉంటారు. పూర్వం “యాద మహర్షి” ఇక్కడి గుట్టపై తపస్సు చేసి .. స్వామివారి సాక్షాత్కారాన్ని పొందాడట. అందువల్లనే ఈ క్షేత్రానికి “యాదగిరి గుట్ట”(Yadagirigutta) అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.
యాద మహర్షి తపస్సుకు మెచ్చిన స్వామి, లక్ష్మీనరసింహుడిగా .. జ్వాలా నరసింహుడిగా .. యోగానంద నరసింహుడిగా .. ఉగ్ర నరసింహుడిగా .. గండభేరుండ నరసింహుడిగా 5 రూపాలలో ఆయనకి దర్శనమిచ్చారట. ఈ కొండపై ఉంటూ భక్తులను అనుగ్రహించమనే యాద మహర్షి అభ్యర్థన మేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు. ఈ కారణంగా ఇది పంచనారసింహ క్షేత్రమని చెబుతారు. యోగానంద నరసింహస్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తూ కొండపై పూజలు అందుకుంటూ ఉంటాడు.
కృతయుగంలో ఇక్కడ ఆవిర్భవించిన స్వామివారు దేవతలతో .. మహర్షులతో పూజలు అందుకున్నారు. ఆ తరువాత అంతర్హితంగా ఉండిపోయారు. కలియుగంలో కొంతకాలం గడిచిన తరువాత, ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలికి కలలో స్వామి కనిపించి ఈ గుట్టపై తాను కొలువై ఉన్నట్టుగా ఆనవాళ్లు చెప్పాడట. గ్రామ పెద్దలను వెంటబెట్టుకుని వెళ్లిన ఆమెకి స్వామివారి మూర్తులను దర్శించింది. అప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
యాద మహర్షి ఇక్కడ “ఉగ్రనరసింహస్వామి”గా కూడా దర్శనం ఇవ్వడం వలన, ఆ స్వామి ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంటుందని అంటారు. దుష్ట శక్తులచే పీడించబడుతున్నవారు .. దుష్ట ప్రయోగాల వలన బాధించబడుతున్నవారు ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే వాటి నుంచి విముక్తులు అవుతారని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు పటాపంచలైపోతాయని నమ్ముతారు. మానసికపరమైన .. శారీరక పరమైన వ్యాధులతో బాధలు పడుతున్నవారు ఇక్కడ నిద్రచేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతారు.
నరసింహస్వామి జయంతితో పాటు ఇతర వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు .. సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ క్షేత్రాన్ని మరింత సుందరంగా .. మరిన్ని వసతి సౌకర్యాలతో తీర్చిదిద్దడం వలన, భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకోవచ్చు. యాద మహర్షికి ఇక్కడ హనుమంతుడి దర్శనం కూడా అయిందని చెబుతారు. ఆ స్వామినే ఇక్కడి క్షేత్ర పాలకుడు. సకల శుభాలను ప్రసాదించే స్వామివారి దర్శనంతోనే ధన్యులమైన అనుభూతి కలుగుతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Yadagirigutta Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple