జరాసంధుడిని అంతం చేయడానికిగాను భీముడిని వెంటబెట్టుకుని బ్రాహ్మణుడి వేషంలో కృష్ణుడు బయల్దేరతాడు. అలా వాళ్లిద్దరూ వెళుతూ ఉండగా జరాసంధుడి జన్మరహస్యాన్ని భీముడితో చెప్పడం మొదలుపెడతాడు కృష్ణుడు. మగధ రాజ్యాన్ని “బృహద్రధుడు” అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం విషయంలో ఆలస్యం అవుతుండటంతో ఆయన ఆవేదన చెందుతూ ఉంటాడు. ఒకసారి ఆయన తన ఆవేదనను “చండ కౌశికుడు” అనే మహర్షితో చెప్పుకుంటాడు. ఆయన ఒక ఫలాన్ని ఇచ్చి భార్యతో దానిని తినిపించమని చెబుతాడు.

బృహద్రధుడు తనకి ఇద్దరు భార్యలు కావడంతో, మహర్షి ఇచ్చిన ఫలాన్ని రెండు సమాన భాగాలు చేసి వాళ్లకి ఇస్తాడు. ఆ సమాన భాగాలను ప్రసాదంగా స్వీకరించిన ఆయన భార్యలు .. సగం శరీర భాగాలు గల శిశువుకు జన్మనిస్తారు. సగభాగాలతో పుట్టినప్పటికీ ఒకే పోలికలతో ఉండటం చూసిన బృహద్రధుడికి తాను చేసిన పొరపాటు అర్థమవుతుంది. నిర్జీవంగా ఉన్న ఆ భాగాలను ఆయన ఒక నిర్జన ప్రదేశంలో వదిలేస్తాడు. అక్కడి నుంచి భారమైన మనసుతో ఆయన తిరిగి వస్తుండగా, ఒక శిశువు ఏడుపు వినిపిస్తుంది.

తను ఏ ప్రదేశంలో అయితే సగభాగాలుగా ఉన్న శిశువును వదిలేసి వస్తున్నాడో అటు వైపు నుంచే శిశువు ఏడుపు వినిపించడంతో, ఆయన పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఒక రాక్షస స్త్రీ చేతిలో తన శిశువు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తన పేరు “జరా” అని చెప్పిన ఆ రాక్షసి, శిశువు సగభాగాలు కలపగానే ఆ రెండు భాగాలు అతుక్కుని పోవడమే కాకుండా ప్రాణం కూడా వచ్చిందని జరా చెబుతుంది. సంతోషంతో ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్న ఆయన, ఆ శిశువుకు “జరాసంధుడు” అనే పేరు పెడతాడు.

అలా రెండు సగభాగాలుగా జన్మించిన జరాసంధుడు ఆ తరువాత పూర్తి రూపాన్ని పొందాడని భీముడితో కృష్ణుడు చెబుతాడు. జరాసంధుడు మహా భుజబల సంపన్నుడనీ, తపోబల సంపన్నుడని అంటాడు. ఆయనను ఎలాంటి పరిస్థితుల్లోను తక్కువ అంచనా వేయకూడదని చెబుతాడు. కనుక జరాసంధుడితో మాట్లాడేటప్పుడు .. మల్లయుద్ధం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని అంటాడు. అలా వాళ్లిద్దరూ జరాసంధుడి గురించి మాట్లాడుకుంటూనే ఆయన కోట సమీపానికి చేరుకుంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.