Karthika Puranam – 3: Bathing in river for good deeds

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచారించాలి. నదిలో చేసే కార్తీక స్నానం మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం .. దేవతార్చన చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. శివాలయాలలోను .. విష్ణు ఆలయాలలోను దీపాలు వెలిగించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. ఆరోగ్యంగా ఉండి స్నానం కూడా చేయనివారు అనేక పాపలు చేసినట్టు అవుతుంది. ఆ పాపాల ఫలితంగా వారు అనేక నీచ జన్మలను ఎత్తవలసి వస్తుంది .. బ్రహ్మ రాక్షసులుగా పుట్టవలసి వస్తుంది.

అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు .. జనకమహారాజుకు ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. “రాజా .. పూర్వం ఆంధ్ర దేశంలో ఒక సత్ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలను కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి .. స్నానం చేసి .. దేవతార్చనను పూర్తిచేసేవరకూ ఎలాంటి ఆహరం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీకమాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయల్దేరతాడు.

అలా ఆయన గోదావరి నదీ తీరప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తున్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రిచెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రాహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు, అటుగా వచ్చినవారిని చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి, ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరూ కూడా ఆ దరిదాపులలోకి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా నిర్మాణుష్యంగా ఉండేది.

తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్త్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావడం వలన ఈ విషయం తెలియదు. అటుగా ఎవరూ రాకపోవడం వలన, ఈ విషయం తెలియజెప్పేవారు ఉండరు. అందువలన తత్త్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తుంటాడు. చాలా దగ్గరికి వచ్చిన తరువాత ఆయన మర్రిచెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులను చూస్తాడు. అంతే .. భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితుల్లో తనని ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు.

మర్రిచెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులు .. తమని చూసి పారిపోతున్న బ్రాహ్మణుడిని చూస్తారు. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంటబడతారు. బ్రహ్మరాక్షసులు తన వెంటబడటం చూసి, తత్త్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలుపెడతాడు. అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతనిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతుంటాడు. తాను బ్రహ్మ రాక్షసులకు చిక్కడం .. వాళ్ల చేతిలో చావడం ఖాయమని ఆయన భావిస్తాడు.

బ్రహ్మ రాక్షసులు తత్త్వనిష్ఠుడిని దాటుకుని ముందుకు వెళ్లి, ఆయనకి ఎదురుగా నిలబడతారు. వాళ్లను చూడగానే ఆయన కంపించిపోతాడు .. తనని వదిలేయమని కోరతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తుపరుడనీ .. నియమనిష్టలు కలిగినవాడనీ ఆయన తేజస్సును బట్టి బ్రహ్మరాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వాళ్లంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. “ఓ బ్రాహ్మణుడా .. భయపడకు .. నిన్ను మేము ఏమీ చేయము. నీవంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది” అంటారు.

ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షసులు తనకి నమస్కరించారో అప్పుడే ఆయనలో భయం తగ్గిపోతుంది. ఆయన మనసు కాస్త తేలికపడుతుంది. దాంతో ఆయన తన ఆయాసం .. దాహం తీర్చుకుంటాడు. ఆ తరువాత అయ్యా మీరెవరూ? చూడటానికి బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తున్నారు. మీ ఆకారానికి .. మాటలకి పొంతన కుదరడం లేదు. మంచివాళ్లలానే మాట్లాడుతున్నారు .. అదే స్వభావంతో కనిపిస్తున్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి? అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.

ఈ ప్రదేశంలో జన సంచారం లేకపోవడం చూసే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే, ఇటుగా ఎవరూ రావడం లేదనే విషయం నాకు అర్థమైంది. కానీ మీరు మర్రిచెట్టుపై ఉండటం వలన, దగ్గరికి వచ్చేవరకూ నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలను చూసే భయంతో పరిగెత్తాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంటపడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సాయమేదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు.

బ్రహ్మరాక్షసులు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. అందులో ఒకడు తన గురించి చెప్పడం మొదలుపెడతాడు. అయ్యా .. నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని .. “మంధరం” అనే గ్రామానికి అధికారిని. మా గ్రామంలో ఎవరైనా నేను చెప్పినట్టుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని, నా తెలివి తేటలకు నేను పొంగిపోయేవాడిని.

ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్లు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంతవరకూ నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు.

అందువల్లనే భగవంతుడు నాపై ఎంతమాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తరువాత బ్రహ్మరాక్షసుడనై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తుంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. నీలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముక్తి కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరడం కోసమే నీ వెంటపడ్డాము. మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధేయపడతాడు.

బ్రహ్మ రాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది. అందరినీ భయపెడుతూ బ్రతకడంలో ఆనందాన్ని పొందకుండా, ఆ జన్మ నుంచి ముక్తిని పొందడానికి ప్రయత్నించడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది .. ఆయన కళ్లలో కనిపిస్తుంది. అప్పుడు ఆయన మిగతా ఇద్దరు బ్రహ్మరాక్షసుల వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి? అని అడుగుతాడు. అప్పుడు రెండవ బ్రహ్మ రాక్షసుడు తన గురించిన విషయాలను చెప్పడం మొదలుపెడతాడు.

బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ .. అయ్యా .. నేను చేసిన పాపం .. కన్నవాళ్లను ప్రేమగా చూసుకోకపోవడమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నేను ఏది అడిగినా .. అది వారి శక్తికి మించినదే అయినా నా ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, వాళ్లు అనేక కష్టాలు పడ్డారు. నిజం చెప్పాలంటే వారు సుఖపడటమనేది నేను చూడలేదు.

ఎప్పటికప్పుడు వాళ్లు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానేగానీ, అందుకోసం వాళ్లు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు. ఊహ తెలిసే వయసులో ఆ విషయాన్ని గ్రహించినా పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనందపెట్టడం కోసమే వాళ్లు జన్మించారన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టాను. యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత, అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా .. హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహమైన తరువాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను.

ఎంతసేపు భార్యకి ఏంకావాలో చూసేవాడిని గానీ .. తల్లిదండ్రులను పట్టించుకుని ఎరుగను. నా సంపాదనంతా కూడా నా భార్యతో విలాసంగా గడపడం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు. సంతానం కలిగిన తరువాత భార్యాబిడ్డలే లోకమైపోయారు. వాళ్లతో ఎప్పుడూ సంతోషంగా గడపడం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మానాన్నలను ప్రేమగా చూసింది లేదు .. కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు. పైగా విసురుకోవడాలు .. కసురుకోవడాలు చేసేవాడిని. అయినా వాళ్లు అనుక్షణం నా బాగునే కోరుకునేవారు.

అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత వయసు పై బడటంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి ఉంటారనేది నాకు అర్థమైంది. చనిపోయిన తరువాత నేను నరకానికి వెళ్లాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను .. ఆ పాపం ఫలితంగానే బ్రహ్మ రాక్షస రూపం కూడా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు .. మాకు విముక్తిని ప్రసాదించు అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు.

బ్రాహ్మణుడు .. మూడవ బ్రహ్మ రాక్షసుడి వైపు చూశాడు .. ఆయన తన కథను చెప్పడం మొదలుపెడతాడు. ఓ బ్రాహ్మణుడా .. నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడినే. కానీ నీ అంతటి ఉత్తముడిని కాను. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యం భగవంతుడి పూజలో .. సేవలో తరించవలసిన నేను, ఎప్పుడూ కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకితభావంతో అర్చించినది లేదు. మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెళితే నేను అటు వెళ్లాను.

ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే, నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడి సేవకోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామందే చెప్పారు. కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్లాను. అందుకు నరకలోకంలో తగిన శిక్షలనే అనుభవించాను.

ఇక ఆ పాపంలోని భాగంగానే బ్రహ్మరాక్షసుడిగా ఈ మర్రిచెట్టుని పట్టుకుని ఉన్నాను. దయతో మాకు ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించు. అందుకు ఏం చేయాలో చెబితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఇక మీరు బాధపడవలసిన పనిలేదు. ఇది కార్తీక మాసం .. నేను నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శిస్తూ వెళుతున్నాను. మరి కొన్ని రోజులలో “కావేరి నది”కి చేరుకుంటాను .. మీరు నన్ను అనుసరించండి. కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి అని చెబుతాడు.

బ్రహ్మరాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముగ్గురూ కూడా ఆ బ్రాహ్మణుడిని అనుసరిస్తారు. అలా కొన్ని రోజులపాటు ప్రయాణించి వాళ్లు కావేరి నదికి చేరుకుంటారు. ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు. ఆయన ఆదేశం మేరకు ముగ్గురు బ్రహ్మ రాక్షసులు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాన్ని ఆ ముగ్గురికి ధారపోస్తాడు. దాంతో వాళ్లకి బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి లభించి, దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్లిపోతారు. కార్తీకంలో నదీ స్నానం ఎంతటి పుణ్యప్రదమైనదనేది తెలుసుకుని, వశిష్ఠ మహర్షికి జనకమహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

Karthika Puranam – 3: Bathing in river for good deeds