Karthika Puranam – 9: Vishnubhats quarrel with Yamabhats

అజామీళుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్లడానికి సిద్ధపడటం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. తలిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టినవారినీ, వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసినవారినీ .. గురువులను అవమానించినవారినీ .. మిత్రద్రోహం చేసినవారినీ .. పరస్త్రీల … పరపురుషుల పట్ల వ్యామోహం కలిగినవారినీ .. శార్ధకర్మలు ఆచరించనివారినీ .. మూగజంతువులను హింసించినవారినీ .. దానధర్మాలు చేయనివారినీ .. అసత్యాలు పలికేవారినీ .. ఆచారవ్యవహారాలు పాటించనివారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభటులు అంటారు.

శ్రీమహావిష్ణువును పూజించినా … సేవించినా .. సాలగ్రామాన్ని పూజించినా .. తులసిదళాలతో భగవంతుడిని అర్చించినా .. భాగవత పురాణమును పఠించినా హరినామస్మరణ చేసినా అలాంటివారు నరకలోకం దగ్గరలోకి కూడా రారని విష్ణుదూతలు చెబుతారు. ఎవరు ఎలాంటి పాపాలు చేసినా, అవసానదశలో విష్ణునామ స్మరణ చేయడం వలన అన్ని పాపాలు నశించి, విష్ణు లోకంలో స్థానం లభిస్తుందని అంటారు. తన ప్రాణాలు పోతుండగా అజామీళుడు శ్రీహరి నామ స్మరణ చేయడం వలన, ఆయనను విష్ణు లోకానికి తీసుకెళ్లడానికి వచ్చామని చెబుతారు.

ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీళుడు ఆశ్చర్యపోతాడు. తన కుమారుడి పేరు నారాయణ అనీ, చనిపోవడానికి ముందు తాను కుమారుడిని పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు. తాను ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేశానా అనే ఆలోచనలో పడతాడు. తమ పనికి విష్ణుభటులు అడ్డుచెప్పడంతో, యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళతారు. అజామీళుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది.

అజామీళుడు నీతినియమాలను పక్కన పెట్టేసి .. ఆచార వ్యవహారాలను వదిలేసినవాడని యమభటులు చెబుతారు. అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు. అందుకు కారణం అడిగితే అతను విష్ణు నామస్మరణ చేశాడని అంటున్నారని చెబుతారు. అందుకు యమధర్మరాజు స్పందిస్తూ .. “తెలిసి తాకిన .. తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది. అలాగే తెలిసి చేసినా .. తెలియక చేసినా హరినామ స్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది. అజామీళుడి విషయంలో అదే జరిగింది” అని యమధర్మరాజు చెబుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.

Karthika Puranam – 9: Vishnubhats quarrel with Yamabhats