యమభటులను అక్కడి నుంచి పంపించి వేసిన యమధర్మరాజు .. అజామీళుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు. అసలు ఈ అజామీళుడి గతజన్మ ఏంటి అనేది ఆయన దివ్యదృష్టితో చూస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా, ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది. ఆకర్శణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంభావంతో ఆయన మిడిసిపడుతూ ఉండేవాడు. ఆచారవ్యవహారాలకంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు. పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది.

ఇక అదే ఊళ్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు. భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపైకి వెళుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి. ఒక రోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి, త్వరగా వంటచేయమని చెబుతాడు. పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు .. ఆయన మాటలను వినిపించుకోదు. అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడంలో అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లువదిలి వెళ్లిపోతాడు.

భర్త అలా వెళ్లిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తుంది. మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు. ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు. తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది. తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది. ఇల్లొదిలి వెళ్లిన భర్తను బ్రతిమాలి మళ్లీ తీసుకువస్తుంది. అయితే ఆమె .. శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్లను విడిచిపెట్టలేదు.

ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడైన అజామీళుడుగా జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది. జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసీకి ఇచ్చేస్తారు. ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసీ అవుతుంది. ఆ దాసీ వ్యామోహంలోపడిన అజామీళుడు, అనేక పాపాలు చేస్తాడు. ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామీళుడు, చివరి నిమిషంలో “నారాయణ” అంటూ తన కొడుకును పిలుస్తాడు .. ఆ నామమే ఆయనను కాపాడుతుంది. అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది. ఇలా ఈ కథ ద్వారా విష్ణునామ స్మరణ ఎంత గొప్పదనేది జనక మహర్షికి వశిష్ఠ మహర్షి చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.