Sri Bhagavatam – Hiranyakasipu’s thought about Prahlad
హిరణ్యకశిపుడు ఆలోచనలో పడతాడు. తన భటులు తన ఆదేశానుసారం నడుచుకున్నారు .. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తాను చెప్పినట్టుగానే వాళ్లు తన కుమారుడిని ఏనుగులతో తొక్కించారు .. సముద్రంలో విసిరేశారు .. సర్పాలతో కాటు వేయించారు. గదా .. శూలములతో హింసించారు. పర్వతములపై నుంచి పడదోశారు. అయినా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. శిక్షలు అమలు చేస్తున్నప్పుడు కనీసం అతను భయపడటం లేదు. అది ప్రహ్లాదుడు అమాయకత్వమా? ధైర్యమా?
ఏ శిక్షలు వేసిననూ ప్రహ్లాదుడికి ఎలాంటి గాయాలు కావడం లేదు. శిక్షకు ముందు అతను ఎలా ఉంటున్నాడో, ఆ తరువాత కూడా అదే విధంగా ప్రశాంతంగా .. సంతోషంగా ఉంటున్నాడు. ఏ శక్తి అతనిని కాపాడుతోంది. అసలు ప్రహ్లాదుడు తన బుద్ధిపూర్వకంగా ఇలా ప్రవర్తిస్తున్నాడా? తనకి మనశ్శాంతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా తనపైకి ఉసిగొల్పుతున్నారా? అని పరి పరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఆలోచనల కారణంగా ఆయన నిద్రాహారాలకు దూరమవుతాడు.
శిక్షను అమలు చేయడానికి తన బిడ్డను తీసుకువెళుతున్నప్పుడల్లా కన్నీళ్లపర్యంతం కావడం .. అతను తిరిగి రాగానే ఆనందపడటం లీలావతి వంతు అవుతుంది. ఈ రెండింటికీ మధ్య ఆమె అనునిత్యం నలిగిపోతుంటుంది. హరినామస్మరణ మానుకోమని చెబితే ప్రహ్లాదుడు వినిపించుకోడు. పసిపిల్లవాడితో పంతమేమిటని అంటే హిరణ్యకశిపుడు పట్టించుకోడు. ఏ క్షణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోననే భయంతో ఆమె భారంగా రోజులు గడుపుతూ ఉంటుంది. ఏ క్షణంలో తన బిడ్డ తనకి దూరమవుతాడోననే బెంగతో నిద్రాహారాలకు దూరమవుతుంది.
ప్రహ్లాదుడు మాత్రం ఎప్పటిలానే హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. ఎన్ని రకాల శిక్షలను విధించినా ఆయన తండ్రిని ద్వేషించడు. భర్త మాటకు ఎదురు చెప్పలేక కుమిలిపోతున్న తన తల్లిని మాత్రం అతను ఊరడిస్తూనే ఉంటాడు. భగవంతుడే సత్యం .. భగవంతుడే నిత్యం .. ఆయనే మోక్షాన్ని ప్రసాదించేవాడు. అలాంటి ఆ స్వామి నామాన్ని స్మరించడం వల్లనే జన్మ సార్థకమవుతుందని చెబుతుంటాడు. అతను శ్రీహరిని గురించి మాట్లాడుతున్నప్పుడలా హిరణ్యకశిపుడు ఆగ్రహం కట్టలుతెంచుకుంటూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.