Sri Bhagavatam – A hunter comes chasing the deer

శ్రీకృష్ణుడు ఒక వనంలోని బండకు తన తలను ఆనించి, కాలుపై కాలువేసుకుని పైపాదాన్ని ఆడిస్తూ ఉంటాడు. అదే సమయాల్లో ఒక వేటగాడు ఓ లేడిని వేటాడుతూ అటుగా వస్తాడు. ఆ లేడి కోసం అతను బాణం వేయడం .. అది తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ వేటగాడి దగ్గర ఉన్న బాణాలు అయిపోతాయి. అదే సమయంలో అతనికి ఒక పొడవైన కర్రపుల్ల దొరుకుతుంది. అది యాదవులు సగం అరగదీసి వదిలేసిన “ముసలం” తాలూకు కర్రపుల్ల. ఆ వేటగాడు దానిని మరింత పదునుగా తయారు చేసుకుని ఆ వనంలోని ప్రవేశిస్తాడు.

ఆ లేడిపిల్ల గెంతుతూ వనంలో అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటుంది. వేటగాడు దానిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతుంటాడు. ఎక్కడా ఎలాంటి చప్పుడు చేయకుండా ఆ లేడిని అనుసరిస్తూ ఉంటాడు. లేడి కనిపించడమే ఆలస్యం వదలడానికి సిద్ధంగా బాణంతో నడుస్తుంటాడు. తన అలికిడికి లేడి పారిపోకుండా ఉండడటం కోసం, చాలా నెమ్మదిగా అతను అడుగులు వేస్తూ ఉంటాడు. కొంతదూరం వెళ్లిన అతనికి ఎక్కడా ఎలాంటి చప్పుడు రాకపోవడంతో, ఆలోచనలో పడతాడు.

తన బారి నుంచి లేడి తప్పించుకుందేమో .. అందుకే ఎక్కడా దాని అలికిడి కావడం లేదు. తన కళ్లుగప్పి అది ఈ వనం నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఆ లేడి కోసం తాను ఇంత దూరం ఇంతగా శ్రమపడుతూ రావడం వృథా అయింది. ఈ రోజున తాను ఖాళీ చేతులతో వెనుదిరగవలసిందేనా? అనుకుని ఆ వేటగాడు నీరసపడిపోతాడు. ఈ రోజున తన అదృష్టం బాగోలేకపోవటం వల్లనే ఎప్పటికప్పుడు గురితప్పుతూ వచ్చింది. అప్పుడే తాను వెనుదిరగవలసింది. అనవసరంగా ఇంత దూరం వచ్చానని దిగాలుపడిపోతాడు.

అంతలో అతనికి కొంత దూరంలో ఏదో అలికిడి అవుతుంది. ఒక్కసారిగా ఆ వేటగాడి ముఖంలో ఆనందం చోటుచేసుకుంటుంది. ఆ చప్పుడు అయిన దిశగా ఆ వేటగాడు తీక్షణంగా చూస్తాడు. ఒక పొదచాటున ఏదో కదిలినట్టుగా ఆతనికి అనిపిస్తుంది. ఆ లేడి తనకి భయపడి అక్కడ దాక్కుని ఉంటుందని అతను భావిస్తాడు. ఇక ఆలస్యం చేయకూడదనుకుంటూ, గురిచూసి ఆ దిశగా బాణం వదులుతాడు. ఆ వెంటనే “అబ్బా” అనే బాధతో కూడిన అరుపు వినిపించగానే వేటగాడు బిత్తరపోతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – A hunter comes chasing the deer