Sri Bhagavatam – Balichakravarthy visits Shukracharya – Heads for war on Amaravathi

క్షీరసాగర మథనంలో అమృతభాండం బయటపడినప్పుడు, దానిని తమకి ఇవ్వకుండా దేవతలు మాత్రమే సేవించడం తమని మోసం చేయడమేనని దానవులరాజైన బలిచక్రవర్తి భావిస్తాడు. అమృతం సేవించిన దేవతలను తాము గెలవలేమనే ఆలోచన ఆయనకి నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది. దాంతో ఆయన శుక్రాచార్యుడిని కలుసుకుని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇకపై దేవతలను ఎదుర్కోలేని శక్తి హీనులుగా బ్రతకవలసిందేనా? అంటూ దిగాలు పడతాడు.

శుక్రాచార్యుడికి ఆయన ఆవేదన అర్థమవుతుంది .. దేవతలను గెలవడానికి ఒక మార్గం ఉందంటూ, ఆయనతో శుక్రాచార్యుడు “విశ్వజిత్” యాగం చేయిస్తాడు. ఆ యాగం ద్వారా బలిచక్రవర్తి దివ్యమైన రథంతో పాటు దివ్యాస్త్రాలను పొందుతాడు. ఇకపై దేవతలపైకి యుద్ధానికి వెళ్లవచ్చని శుక్రాచార్యుడు చెప్పడంతో, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి, దేవతలపైకి యుద్ధానికి బయల్దేరతాడు. దానవులరాజైన బలిచక్రవర్తి అమరావతిపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం ఇంద్రాది దేవతలకు తెలిసిపోతుంది.

జరిగినదానికి బలిచక్రవర్తి భయపడి .. నిరాశపడి .. నీరసపడి ఇకపై తమ జోలికి రాకుండా ఉంటాడని తాము అనుకుంటే, ఇంతకుముందు కన్నా ఆయన మరింత ధైర్యంతో ముందుకు దూసుకురావడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లంతా కూడ ఈ విషయాన్ని తమ గురువైన బృహస్పతికి చెబుతారు. బలిచక్రవర్తి బలం పుంజుకోవడానికి గల కారణం ఆయనకి తెలిసిపోతుంది. బలిచక్రవర్తి “విశ్వజిత్ యాగం” చేశాడు. దివ్యమైన అస్త్రాలను సంపాదించుకుని తమపైకి వస్తున్నాడని చెబుతాడు.

బలిచక్రవర్తిని తాము ఎలా ఎదుర్కొవాలన్నది సెలవీయమని దేవతలు అడుగుతారు. బలిచక్రవర్తి సాధించుకున్న ఆయుధాల కారణంగా ఈ సారి ఆయనతో ఎవరూ యుద్ధం చేయలేరని బృహస్పతి చెబుతాడు. అందువలన ఆయనతో యుద్ధం చేయాలనే ఆలోచనను విరమించుకోమని అంటాడు. బలిచక్రవర్తి అమరావతికి చేరుకునే సరికి ఆయన కంటపడకుండా ఎక్కడికైనా వెళ్లిపొమ్మని చెబుతాడు. ప్రస్తుతం అంతకు మించిన మార్గం లేదని తేల్చి చెబుతాడు. దాంతో అంతా అమరావతిని ఖాళీ చేసి పారిపోతారు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.