దానవులంతా తన సౌందర్యానికి దాసులయ్యారనే విషయాన్ని మోహిని రూపంలోని విష్ణుమూర్తి గ్రహిస్తాడు. ఇక తాను ఎలా చెబితే అలా వింటారని భావిస్తాడు. అమృతాన్ని తాను అందరికీ సమానంగా పంచుతానని దానవులతో మోహిని అంటుంది. దేవతలకి పంచడానికి వీల్లేదని అంటే .. తమకి కూడా ఆమె పంచవలసిన అవసరం లేదని అంటే ఆ సౌందర్యరాశి తమపై అలక వహిస్తుందని వాళ్లంతా భావిస్తారు. ఆమె మాట కాదంటే కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతే తమ పరిస్థితి ఏం కావాలి? అని ఆందోళన చెందుతారు. అందువలన ఆమె ఎలా అంటే అలా చేయడానికి తామంతా సిద్ధమని అంటారు.

దానవులు ఆ మాట అనడమే ఆలస్యం వాళ్ల చేతుల్లో ఉన్న అమృతభాండాన్ని మోహిని అందుకుంటుంది. వాళ్లు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఆమెకి అమృతకలశాన్ని అందిస్తారు. ముందుగా దేవతలను .. దానవులను మోహిని వేరువేరుగా కూర్చోబెడుతుంది. ఎవరూ అమృతం గురించి గొడవపడొద్దనీ .. అందరికీ తాను సమంగా పంచుతానని అంటుంది. ముందుగా దేవతలకు పంచేసి .. ఆ తరువాత దానవులకు పంచుతానని చెబుతుంది. మంత్రం వేసినట్టుగా వాళ్లంతా అంగీకార ప్రాయంగా తలాడిస్తారు.

మోహిని అమృతభాండం పట్టుకుని ముందుగా దేవతలకు పంచుతూ వెళుతూ ఉంటుంది. దానవులు మాత్రం ఆమె పంచుతున్న అమృతం వైపు కాకుండా ఆమె సౌందర్యాన్ని చూస్తూ మురిసిపోతుంటారు. దేవతలకు అమృతం పంచడం పూర్తవ్వగానే తమకే పంచుతుంది. అప్పుడు మోహినీ అందచందాలను మరింత దగ్గరగా చూడవచ్చని ఆశపడుతుంటారు. ఇలా వాళ్లంతా ఆలోచన చేస్తుండగా దేవతలకు మోహిని చకచకా అమృతాన్ని పంచుతూ వెళుతుంది. అలా దేవతలవరకే అమృతాన్ని అవ్వగొడుతుంది.

అయితే దానవులకి చెందిన “రాహువు” తెలివిగా దేవతల వైపుకు వచ్చేసి కూర్చుంటాడు. వాళ్లతో పాటు కలిసి అమృతం సేవిస్తాడు. అది చూసిన సూర్యచంద్రులు .. ఈ విషయాన్ని వెంటనే విష్ణుమూర్తితో చెబుతారు. అసురులకు అమృతం అందితే లోకాలను అల్లకల్లోలం చేస్తారని తెలిసి, తాను ఇంతగా పథకరచన చేస్తే, రాహువు అమృతాన్ని సేవించడం ఆయనను కలవరపాటుకు గురిచేస్తుంది. దాంతో వెంటనే ఆయన తన సుదర్శన చక్రంతో “రాహువు” శిరస్సును ఖండిస్తాడు. దేవతలు తమని మోసం చేసారనీ .. మోహిని రూపంలో వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకుని దానవులు ఆగ్రహావేశాలకు లోనవుతారు .. తమ అజ్ఞానానికి చింతిస్తారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.