Devuni Kadapa Venkateswara Swamy Temple

వేంకటేశ్వరస్వామి కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో “దేవుని కడప” ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు కడపకి అత్యంత సమీపంలో ఉన్న ఈ క్షేత్రం .. ఇప్పుడు కడపలో కలిసిపోయే కనిపిస్తుంది. వేంకటేశ్వరస్వామి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించక ముందు ఇది హనుమత్ క్షేత్రంగా ఉండేదనీ .. ఆ తరువాత స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయంలోని గర్భాలయం లోపల వేంకటేశ్వరస్వామి వెనుక హనుమ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఇది హనుమ క్షేత్రంగానే పిలవబడింది.

మహాభారతంలో మనకి కనిపించే కృపాచార్యుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈ ప్రాంతానితో ఆయనకి గల సంబంధం ఏమిటి? అనేది తెలియదు కానీ, ఆయన ఇక్కడి స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. దీనిని బట్టి ఇక్కడి స్వామివారు ఎప్పటివాడో .. ఆ స్వామి వెనుక ఉన్న హనుమ మూర్తి ఎంత ప్రాచీనమైనదనేది అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ఇక్కడి స్వామి విజయనగర స్థాపనకు ముందుగా వెలుగులోనికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. హరిహర రాయలు .. బుక్కరాయలు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు.

శ్రీకృష్ణదేవరాయల వారు ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని పలుమార్లు దర్శించి కానుకలను సమర్పించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. అలాగే ఈ క్షేత్ర వైభవానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అప్పట్లో తిరుమలకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ ఆగి .. ఈ క్షేత్రదర్శనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పటికీ కూడా అలా చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో .. ప్రాచీన వైభవానికి అద్దంపడుతూ ఈ ఆలయం కనిపిస్తుంది. గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసితీరవలసిందే.

ఇక అమ్మవారు ప్రత్యేకమైన మందిరంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న వెంటనే అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనేక కీర్తనలు ఆలపించిన అన్నమయ్య, దేవుని కడపలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకుని .. ఆ స్వామిపై కూడా కీర్తనలు రచించినట్టుగా చెబుతారు. అలా అన్నమయ్య కూడా ఈ క్షేత్రంలో తిరుగాడినట్టుగా తెలియగానే, మనసు మరింత భక్తి భావజాలంతో నిండిపోతుంది.

మహాభారతకాలం నాటి క్షేత్రం .. మహర్షులచే పూజలందుకున్న స్వామి .. మహాభక్తులు నడయాడిన క్షేత్రం .. మహారాజులు దర్శించిన క్షేత్రంలో మనం ఉన్నామనే భావన కలిగినప్పుడు పొందే ఆనందాన్ని చెప్పడానికి మాటలు చాలవు. అలాంటి ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వలన, సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Devuni Kadapa Venkateswara Swamy Temple