Sri Bhagavatam – Lord Vishnu slaying Hiranyaksha in Varaha avataram

కశ్యప ప్రజాపతి తమ ఇద్దరు బిడ్డల భవిష్యత్తును గురించి చెప్పగానే ఆయన భార్య దితి ఆవేదన చెందుతుంది. వాళ్లను మంచి మార్గంలో నడిపించే మార్గమే లేదా? అని అడుగుతుంది. అలా చేయడం అసాధ్యమనీ .. వాళ్లిద్దరూ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ భగవంతుడి ఆగ్రహానికి కారకులవుతారని చెబుతాడు. ఒక తల్లిగా ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. కశ్యప ప్రజాపతి చెప్పినట్టుగానే హిరణ్యాక్షుడు .. హిరణ్యకశిపుడు అసురగుణాలతో పెరిగి పెద్దవారవుతారు.

ప్రళయకాలంలో భూమండలమంతా జలగర్భంలో కలిసిపోతుంది. మళ్లీ సృష్టి చేయాలంటే భూమి కావాలి .. కానీ భూమండలం జలగర్భంలో ఉండిపోయిందని బ్రహ్మదేవుడు .. విష్ణుమూర్తితో చెబుతాడు. అయితే భూమండలం మొత్తం తానే ఏలేయాలనే ఒక స్వార్థంతో నీట మునిగిన భూమిని హిరణ్యాక్షుడు తన అధీనంలో ఉంచుతాడు. భూమండలం దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు. జలగర్భంలోని భూమండలం హిరణ్యాక్షుడి అధీనంలో ఉందనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది.

దాంతో ఆయన యజ్ఞవరాహ రూపాన్ని ధరిస్తాడు. అనంతంగా ఆక్రమించిన జలగర్భంలోకి ప్రవేశిస్తాడు. జలగర్భంలోకి వెళుతూనే తన ఆకారాన్ని పెంచుతూ వెళతాడు. జలగర్భంలోకి ఏదో జంతువు ప్రవేశించిందనే విషయం హిరాణ్యాక్షుడికి అర్థమైపోతుంది. దాంతో దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు. పొడవైన రెండు కొరకొమ్ములతో తన వైపు దూసుకు వస్తున్న వరాహ రూపం పైకి తన దగ్గర గల పదునైన ఆయుధాలను ప్రయోగించడం మొదలుపెడతాడు. ఆ ఆయుధాలు ఆ వరాహాన్ని ఏమీ చేయలేకపోతుంటాయి.

అత్యంత శక్తిమంతమైన తన ఆయుధాలు నిరుపయోగం కావడం .. వరాహం యొక్క రూపం అంతకంతకూ పెరుగుతూ ఉండటం చూస్తాడు. అయినా భూమండలం మొత్తాన్ని ఏలాలనే స్వార్థంతో యుద్ధానికి ఎదురు నిలుస్తాడు. తనశక్తి మేరకు పోరాటానికి ప్రయత్నిస్తాడు. వరాహరూపంలోని విష్ణుమూర్తి తన కోర కొమ్ములతో హిరాణ్యాక్షుడిని చీల్చేస్తాడు. ఆ అసురుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోతాయి. అలా విష్ణుమూర్తి .. వరహారూపం ధరించి హిరాణ్యాక్షుడిని వధిస్తాడు. లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు చేసిన పోరాటానికి గాను దేవతలు ఆయనపై పుష్పవర్షం కురిపిస్తారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి