Sri Bhagavatam – Lord Hanuman finds Seetha whereabouts.
రాముడు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు .. ఇక రాముడికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సుగ్రీవుడు భావిస్తాడు. అనేక ప్రాంతాల నుంచి వానర సమూహాలను రప్పిస్తాడు. వానర సమూహాలను నాలుగు భాగాలుగా విభజించి నలు దిక్కులకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిక్కుకు వెళ్లవలసిన బాధ్యత హనుమ సమూహానికి అప్పగించబడుతుంది. దాంతో ఒకవేళ సీతమ్మతల్లి కనిపిస్తే, ఆమెకి చూపించడానికి గుర్తుగా ఏదైనా ఇవ్వమని రాముడిని హనుమంతుడు అడుగుతాడు. అప్పుడు రాముడు ఆయనకి తన ఉంగరం ఇస్తాడు.
వానరులంతా ఉత్సాహపరచగా హనుమంతుడు సముద్రంపైకి ఎగురుతాడు. సముద్రంపై ఆకాశ మార్గాన ప్ర్రయాణిస్తూ లంకానగరం ముఖద్వారం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కాపలా ఉన్న లంఖిణి అనే రాక్షసిని అంతమొందించి, సూక్ష్మరూపంలో లోపలికి ప్రవేశిస్తాడు. సీతమ్మతల్లి కోసం అక్కడి రాజభవనాలాలో .. వనాలలో వెదకడం మొదలుపెడతాడు. అలా అశోకవనంలోకి చేరుకుంటాడు. అక్కడ ఒక చెట్టు నీడలో ఒక స్త్రీ కూర్చుని విలపిస్తూ ఉండటం .. ఆమెను అనేక విధాలుగా ఒక అసురుడు హెచ్చరిస్తూ ఉండటం చూస్తాడు.
ఆ అసురుడే రావణుడు .. ఆ చెట్టుక్రింద కన్నీళ్ల పర్యంతమవుతున్న సాధ్వీమణినే సీతమ్మతల్లి అని హనుమంతుడు గుర్తిస్తాడు. అక్కడి నుంచి రావణుడు వెళ్లగానే. సూక్ష్మ రూపంలో ఆమె దగ్గరికి హనుమంతుడు చేరుకుంటాడు. తనపై ఆమెకి నమ్మకం కలగడం కోసం ముందుగా శ్రీరాముడి గుణసంకీర్తన చేస్తాడు. ఆ తరువాత తనని రాముడు పంపించాడని చెబుతాడు. తన దగ్గర గల రాముడి ఉంగరాన్ని ఆమెకి చూపుతాడు. త్వరలోనే రామలక్ష్మణులు వచ్చి రావణ సంహారం చేసి ఆమెను విడిపిస్తారని ధైర్యం చెబుతాడు. వానర వీరులపై ఆమెకి నమ్మకం కలిగిస్తాడు.
సీతమ్మ జాడను తెలుసుకోవడం పూర్తయింది .. ఇక రావణుడి లంకానగరం .. ఆయన సైనిక బలగం .. నగర నిర్మాణ రహస్యాలను తెలుసుకోవాలని హనుమంతుడు అనుకుంటాడు. అంతే ఆ క్షణమే వనాలను ధ్వంసం చేయడం మొదలుపెడతాడు. తనని బంధించడానికి ప్రయాత్నించిన వాళ్లందరినీ పరలోకానికి పంపిస్తుంటాడు. చివరికి కావాలనే మేఘనాథుడికి పట్టుబడతాడు. లంకా నగరంలో అల్లకల్లోలాన్ని సృష్టించిన మహా వానరం ఇదేనని హనుమంతుడిని రావణుడి ఎదురుగా నిలబెడతాడు మేఘనాథుడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Lord Hanuman finds Seetha whereabouts.