Thiruparankundram Subramanya Swamy Temple Madurai

సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో విగ్రహరూపంలోను .. మరికొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామి చాలా క్షేత్రాలలో నుంచున్న భంగిమలో ఒక్కడే దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామి కూర్చున్న భంగిమలో .. అదీ దేవసేన సమేతుడై కనిపిస్తుంటాడు. అందుకు కారణం స్వామివారికి దేవసేనతో ఇక్కడ వివాహం జరగడమే. అలా సుబ్రహ్మణ్యస్వామి .. దేవసేనల వివాహం జరిగిన క్షేత్రమే “తిరుప్పరంకున్రమ్”.

తమిళనాడులోలోని సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాలు అత్యంత ప్రాచీనమైనవిగా .. మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు. అలాంటి ఆరు క్షేత్రాలలో తిరుప్పరంకున్రమ్ ఒకటిగా కనిపిస్తుంటుంది. మధురైకి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. మిగతా ఐదు క్షేత్రాలలో సుబ్రహ్మణ్యస్వామి నుంచునే దర్శనమిస్తుంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం కూర్చున్న భంగిమలో దేవసేన సమేతుడై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. స్వామివారికి దేవసేనతో ఇక్కడే వివాహం జరిగినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

దేవతలకి తలనొప్పిగా మారిన శూరపద్ముడిని అంతమొందించడానికి ఏం చేయాలనేది దేవేంద్రుడికి అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సుబ్రహ్మణ్యస్వామిని శరణు కోరతాడు. దాంతో సుబ్రహ్మణ్యస్వామి దండయాత్ర ప్రకటించి శూరపద్ముడిని అంతం చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా ఇంద్రుడు తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా సకల దేవతల సమక్షంలో ఇక్కడే వారి వివాహం జరిగిందని చెప్పబడుతోంది. అందుకు నిదర్శనంగానే గర్భాలయంలో ఇతర దేవతల రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.

ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామిని దేవతలు .. మహర్షులు సైతం కొలిచేవారని చెబుతారు. ఆయా రాజుల కాలంలో స్వామివారి వైభవం పెరుగుతూ వచ్చింది. ఎంతోమంది భక్తులను స్వామివారు అనుగ్రహించారనడానికి ఇక్కడ అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. ఈ క్షేత్ర దర్శనం వలన సంతాన పరమైన దోషాలు .. వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలా తమ కోరికలు నెరవేరినవారు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఇక సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడానికి ముందే భక్తులు సదాశివుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంగణంలోని శివలింగం స్వయంభువు అని స్థల పురాణం చెబుతోంది. సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రి అనుగ్రహాన్ని కోరి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమై, తనయుడి కోరికమేరకు స్వయంభువుగా మారిపోయినట్టుగా చెబుతున్నారు. ముందుగా ఈ స్వామిని దర్శించుకుని ఆ తరువాతనే సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తమిళనాడులో దర్శించుకోవలసిన క్షేత్రాలలో ఇది ఒకటి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Thiruparankundram Subramanya Swamy Temple Madurai