Kanchipuram – Varadaraja Perumal Temple
తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన .. పురాణాలలో ప్రస్తావించబడిన క్షేత్రాలలో కంచిలోని “వరదరాజస్వామి” క్షేత్రం ఒకటి. దీనినే “కాంచీపురం” అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారిని వరదరాజ పెరుమాళ్ అని పిలుచుకుంటారు. ఇది 108 దివ్యదేశాలలో ఒకటిగా అలరారుతోంది. రెండు కళ్లతో ఒకేసారి చూడలేనంత .. ఒక చూపులో పట్టనంత పెద్ద క్షేత్రం ఇది. ఈ క్షేత్రం వైభవాన్ని చాటుతున్నట్టుగా నిలిచిన గోపురం విస్మయులను చేస్తుంది. పొడవైన ప్రాకారాలు .. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో తొణికిసలాడే మంటపాలు .. మహిమాన్వితమైన కోనేర్లు ఆలయ ఘనతకు అద్దం పడుతుంటాయి.
ఒక వైపున ఒక రోజులో తెలుసుకోలేని చరిత్ర .. మరో వైపున ఆశ్చర్య చకితులను చేసే ఆధ్యాత్మిక సంపద ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏ విషయాలను ముందుగా తెలుసుకోవాలనేది తేల్చుకోలేని పరిస్థితి. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారు “పెరుందేవి” పేరుతో ఉన్న అమ్మవారితో కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. 108 దివ్యదేశాలలో స్వామివారి ఒక్కో గర్భాలయ విమానానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారి గర్భాలయ విమానం పేరు “పుణ్యకోటి”. ఈ విమానంలో వైభవమూర్తిగా వెలుగొందుతున్న స్వామివారి సౌందర్య శోభను చూసి తీరవలసిందే.
ఈ క్షేత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది కాదు .. కొన్ని యుగాల క్రితం నాటిది. ఎప్పుడో సత్యయుగంలో జరిగిందో తెలియదుగానీ .. ఒక సత్యయుగంలో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు స్వామివారు సాక్షాత్కారాన్ని కోరుతూ ఇక్కడ ఒక యాగాన్ని చేశాడని అంటారు. అప్పుడు స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించాడని కథనం. అలా దేవతలతో … మహర్షులతో వరదరాజస్వామి పూజలు అందుకున్నారు.
ఆదిశంకరాచార్యులవారు .. రామానుజాచార్యుల వారు ఇక్కడి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ నిర్మాణాన్ని పల్లవరాజులు తలపెట్టినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులంతా స్వామివారి ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ వెళ్లారు. అందువలన ఆయా కాలాల్లోని నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకు సంబంధించిన శాసనాలు ఆ వివరాలను అందిస్తూ ఉంటాయి. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ఈ క్షేత్రంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ ఆలయంపై మతపరమైన దాడులు జరుగుతున్న సమయంలో, విశ్వకర్మ మలచిన స్వామివారిమూర్తిని అప్పట్లో ఒక్కడి పుష్కరిణి అడుగున భద్రపరిచారట. ఆ తరువాత తరంవారికి ఆ విషయం తెలియదు. గర్భాలయంలో మరో మూర్తిని ప్రతిష్ఠించుకుని పూజించుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలంలో కోనేరు అడుగున ఉన్న స్వామివారి మూర్తి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి ఆ మూర్తిని వెలికి తీసి .. పూజాభిషేకాలు నిర్వహించి తిరిగి యధాస్థానంలో ఉంచుతున్నారు. ఆ సమయంలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక ప్రతిఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను .. అందులో భాగంగా జరిగే “గరుడసేవ”ను చూసి తీరవలసిందే. ఇక ఇక్కడి ఆలయంలోని “బంగారు బల్లి” .. “వెండి బల్లి” రూపాలను తాకడం వలన బల్లిపాటు దోషాలు తొలగిపోతాయనే విశ్వాసం అనాదిగా ఉంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.