కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీకపురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచారణ చెప్పబడుతోంది. అంబరీషుడు శ్రీమహావిష్ణువు భక్తుల జాబితాలో ముందువరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు.

ఏకాదశి రోజన ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిధి దాటిపోకముందే పారణ చేయాలి .. అంటే ఆహరం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా “దుర్వాస మహర్షి” అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు. అయితే తాను నదికి వెళ్లి స్నానం ముంగించుకుని వెంటనే వస్తానని చెప్పి, దుర్వాసుడు వెళతాడు. అలా వెళ్లిన దుర్వాసుడు ఎంతకీరాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు.

ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే, అంతకుముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి ఘడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు. దుర్వాసుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది. అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసి తీర్ధం తీసుకోమని సెలవిస్తారు.

వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారణకి పిలిచి, తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా? అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేనివాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది కచ్చితంగా తనని అవమానించాలానే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

దుర్వాసుడి ఆగ్రహావేశాలను గురించి తెలిసిన అంబరీషుడు, ఆయనను శాంతిపజేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంతమాత్రం వినిపించుకోకుండా, పది నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా “కృత్యా” అనే శక్తిని సృష్టించి, అంబరీషుడి పైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీమహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలచుకుంటాడు.

దాంతో ఆయన పూజా మందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం .. సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది, ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసుడి వైపు దూసుకు వస్తుంటుంది. దాంతో ఆయనకి విషయం అర్థమై అక్కడి నుంచి పరుగందుకుంటాడు. బ్రహ్మ దేవుడి దగ్గరికీ .. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని అడుగుతాడు. సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు. దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళతాడు.

వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు. అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించనున్నట్టు చెబుతాడు. ఏయే కారణాల వలన తాను ఏయే అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తను ధరించనున్న దశావతారాలను గురించి వివరిస్తాడు.

అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడనీ, ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైనది కాదని చెబుతాడు. వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడేతప్ప, మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒకసారి అంబరీషుడిని శపించిన ఆయన, అంతటితో ఊర్కోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చింది అని చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.