ఏది నేను? ఏది ఆత్మ? ఏది కర్మ? అనే సందేహాలను దివ్యపురుషుడు వ్యక్తం చేయడంతో, ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు .. ఇంద్రియాలు .. మనసు ఇవేవీ కూడా ఆత్మకాదు. ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్కమాటలో చెప్పాలంటే నేను అనేది శరీరమైతే .. నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మ బంధాల నుంచి విముక్తిని పొందాలి.

స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము .. జపము .. ధ్యానము .. సంధ్యావందనము .. అర్చన చేసి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే, అనేక పాపాలను మోయవలసి వస్తుంది .. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది.

ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము .. గంగను మించిన తీర్థము .. కార్తీక మాసమును మించిన మాసము లేవు. స్వధర్మాన్ని .. కర్మని ఆచరించేవాడు, కార్తీకంలో దామోదరుడిని పూజించేవారు వైకుంఠప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ నాలుగు మాసాలనే “చాతుర్మాస్య వ్రతం”గా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో, వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు.

ఒకసారి నారద మహర్షి .. వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు., భూలోకంలో ఆచారవ్యవహారాలు నశిస్తున్నాయనీ, జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు. భూలోక వాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావడం లేదని చెబుతాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే రుషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు.

లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా, “జ్ఞానసిద్ధుడు” అనే రుషి ఆ విషయాన్ని గ్రహించి, స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామీ .. సమస్త జీవులకు ఆధారము నీవే .. పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రం చేతనే ఉద్ధరించబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు.

అందుకు శ్రీమహా విష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే “చాతుర్మాస్య వ్రతం” చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా “ఆషాఢ శుద్ధ దశమి” నుంచి పాలకడలి నిద్రించి, “కార్తీక శుద్ధ ద్వాదశి” రోజున మేల్కొంటాను. ఆ సమయంలో తనని ఆరాధించినవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి, ఆ తరువాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు.

ఆ తరువాత కార్తీక మహాత్మ్యాన్ని గురించి, జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన “పురంజయుడు” గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహా బలవంతుడు .. తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధుసజ్జనుల విషయంలోను అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి .. అందువలన వారిని తక్కువగా .. చులకనగా చూస్తూ ఉంటాడు.

ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది .. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే, ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రు రాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు.

పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన “కాంభోజరాజు”ను .. ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతుంటారు. ఏనుగులు .. గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు .. కాంభోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంబోజరాజు మాత్త్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు.

ఇక కాంభోజరాజును ఎదుర్కునే శక్తి లేకవడంతో, యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్లముందు కదలాడతాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయిరావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది.

ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు “సుశీలుడు” అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దనీ, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించిన ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడం .. దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీమహావిష్ణువును సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి, కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు.

సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతడి పట్ల పూర్తి విశ్వాసంతో, మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు. కాంభోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు, దానధర్మాలు చేస్తూ .. ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీమహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.