Karthika Puranam – 19: Durvasa seeks refuge – Vishnu Sudarshana Chakra importance
ఇంత జరిగినా అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్యా దోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు. అందువలన నీవు ఆయన దగ్గరికి వెళ్లడమే అన్నివిధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు. దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసుడు పరుగు మొదలుపెడతాడు.
సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ, భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరతాడు. దుర్వాసుడిని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అంబరీషుడు, సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసుడు చాలా ఆందోళనతో ఉన్నాడనీ .. బ్రాహ్మణుడిని సంహరించకూడదని చెబుతాడు. ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరతాడు.
అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం .. దుర్వాసుడి పైకి దూసుకువస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురువెళ్లి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెబుతాడు. అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుడిని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్లమని అంటాడు.
ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడి పైకి వస్తూ ఉండటంతో, ఆగ్రహావేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తినీ .. శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు. ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నాని చెబుతాడు. అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో, సుదర్శనుడు వెనుదిరుగుతాడు.
సుదర్శనుడు వెళ్లగానే .. దుర్వాసుడి దగ్గరకి వెళ్లి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకి కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు. తనవలన ఆయనకి ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి .. తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసుడి మనసును కదిలించివేస్తాయి. అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది.
నాయనా అంబరీషా .. చిన్నవాడివైపోయావుగానీ, నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడనైనా నేను ఎంతో తొందరపడ్డాను. కానీ నీవు చాలా ప్రశాంతచిత్తుడవై వ్యవహరించావు. శ్రీమహావిష్ణువు కరుణాకటాక్షాలు నీయందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. నీలాంటివాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం .. అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత భోజనం చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్లి పోతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.
Karthika Puranam – 19: Durvasa seeks refuge – Vishnu Sudarshana Chakra importance