శ్రీమహావిష్ణువు లీలావిశేషాలలో భాగంగా శ్రీకృష్ణ సత్యభామల గురించి శౌనకాది మునులతో సూతుడు చెప్పడం మొదలుపెడతాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు .. రుక్మిణీ సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు. ఆయన చేతిలో ఉన్న “పారిజాత పుష్పం” గురించి కృష్ణుడు అడుగుతాడు. అది పారిజాతమనీ .. దేవలోక పుష్పమని నారదుడు చెబుతాడు. పారిజాతం ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటుందనీ .. దానికి వాడిపోవడమనేది తెలియదని అంటాడు.

ఆ మాట వినగానే రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది. అందుకే ఆ పారిజాత వృక్షాన్ని శచీదేవి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుందని నారదుడు చెబుతాడు. ఎంతో అపురూపమైన ఆ పుష్పాన్ని ఇష్టభార్య సిగలో ఉంచమని దానిని కృష్ణుడికి అందజేస్తాడు. పక్కనే రుక్మిణీదేవి ఉండటంతో, కృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని ఆమె సిగలో ఉంచుతాడు. ఈ విషయం పరిచారిక వలన సత్యభామకు తెలుస్తుంది. తన మందిరానికి వచ్చిన కృష్ణుడి పట్ల ఆమె అలక చూపుతుంది. ఆమె అలక తీర్చడానికి కృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు.

దేవలోకంలో పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి తన పెరటిలో నాటితేనే తన మనసు కుదుట పడుతుందని సత్యభామ తేల్చి చెబుతుంది. దాంతో కృష్ణుడు ఆమెను వెంటబెట్టుకుని నేరుగా దేవలోకం వెళతాడు. ఇద్దరూ కూడా దేవేంద్రుడి ఆతిథ్యాన్ని అందుకుంటారు. అక్కడి నుంచి పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకురావడానికి కృష్ణుడు ప్రయత్నించగా దేవేంద్రుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవేంద్రుడి తల్లి వచ్చి తన తనయుడిని వారిస్తుంది.

దాంతో ఆయన ఆ పారిజాత వృక్షాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ పారిజాత వృక్షాన్ని తీసుకుని భూలోకానికి వచ్చి, సత్యభామ భవనం పెరటిలో నాటుతాడు కృష్ణుడు. తాను అడిగిన పారిజాత వృక్షం కోసం కృష్ణుడు తనని కూడా తీసుకుని అమరలోకానికి వెళ్లడం .. దేవేంద్రుడితో తలపడటం .. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన అలక తీర్చడం తనపై ఆయనకి గల ప్రేమకి నిదర్శనంగా భావిస్తుంది. తాను ఎంతో పుణ్యం చేసుకోవడం వలన తనకి అంతటి అదృష్టం పట్టిందని భావిస్తుంది. గత జన్మలో తాను చేసుకున్న పుణ్యం ఏమిటి? అని ఆ సందర్భంలోనే ఆమె కృష్ణుడిని అడుగుతుంది. అప్పుడు ఆమెకు కృష్ణుడు చెప్పడం మొదలుపెడతాడు.

తన పూర్వజన్మను గురించి కృష్ణుడు చెబుతూ ఉండగా సత్యభామ వింటూ ఉంటుంది. కృతయుగంలో “మాయ” అనే నగరంలో “దేవశర్మ” అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పండితుడు .. నియమనిష్టలు కలిగినవాడు. ఆచారవ్యవహారాలను తప్పనిసరిగా పాటించేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె “గుణవతి”. పేరుకి తగినట్టుగానే ఆమె సుగుణాలరాశి. పెద్దలపట్ల గౌరవము .. భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండేది. అలా ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టింది. దాంతో ఆయనకి ఆమె వివాహాన్ని గురించిన ఆలోచన పట్టుకుంది.

కూతురు గురించి బాగా ఆలోచన చేసిన ఆయన తన శిష్య బృందంలో బుద్ధిమంతుడైన “చంద్రుడు” అనే వాడికి గుణవతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అది చూసి దేవశర్మ ఎంతో ముచ్చటపడేవాడు. ఒక రోజున దేవశర్మ .. చంద్రుడు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళతారు. అలా వెళ్లిన ఆ ఇద్దరూ ఒక రాక్షసుడి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా మరణించిన మామా అల్లుళ్లు, దైవసన్నిధిలోనే ఎక్కువగా కాలం గడుపుతూ వచ్చిన కారణంగా విష్ణులోకానికి చేరుకుంటారు.

తన తండ్రి .. భర్త మరణించడంతో గుణవతి ఎంతగానో దుఃఖిస్తుంది. భారం భగవంతుడిపై వేసి రోజులు గడుపుతూ ఉంటుంది. భగవంతుడి సేవ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంది. కార్తీకవ్రతాలు .. ఏకాదశి వ్రతాలు అత్యంత భక్తి శ్రధ్ధలతో ఆచరిస్తూ ఉంటుంది. అలా ఆమెకి వయసు పైబడుతుంది. శరీరం ఎంతమాత్రం సహకరించని పక్షంలో కూడా చలిలో ఆమె కార్తీక స్నానం చేయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆమెను దివ్య విమానంలో విష్ణులోకానికి తీసుకుని వెళతారు.

ఆ తరువాత కాలంలో మాయ నగరంలో పండితుడిగా పేరు తెచ్చుకుని, ఆచారవ్యవహారాలు పాటించిన ఆ పండితుడు “సత్రాజిత్తు”గా జన్మించాడు. ఆయన శిష్యుడు చంద్రుడు .. “అక్రూరుడు”గా జన్మించాడు. అనునిత్యం శ్రీహరి నామస్మరణతోను .. ఏకాదశి వ్రతాలతోను జీవితాన్ని గడిపిన ఆ గుణవతియే “సత్యభామ”గా జన్మించిందని కృష్ణుడు చెబుతాడు. దాంతో ఆనందంతో మురిసిపోతూ సత్యభామ ఆయన అక్కున చేరుతుంది.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.