కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ, తిథులలో ఏకాదశి .. మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పృథు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడనీ, ఆ విషయాలను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు. గతంలో నారద మహర్షి – పృథుచక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్లకు కడతాడు. పృథు చక్రవర్తి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి సమాధానం చెప్పడం మెడలుపెడతాడు.

పూర్వం “శంఖుడు” అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అసుర లక్షణాలు కలిగినవాడు గనుక, దేవతలను నానారకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు. దేవలోకాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి దేవతలందరినీ తరిమివేస్తాడు. దాంతో వాళ్లంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరు పర్వత గుహల్లో తలదాచుకుంటారు. వాళ్ల కోసం శంఖుడు గాలిస్తూనే ఉంటాడు. దేవతలను నమ్మకూడదు .. వేదాల ద్వారా వాళ్లు మళ్లీ శక్తిమంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు.

అందువలన వేదాలనేవి లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే దేవతలు వేదాలు ఆ అసురుడి కంట పడకుండా అవి నీటిని అవేసించి ఉండేలా చేస్తారు. శంఖుడికి అనుమానం వస్తుంది .. నీటియందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెదకడం మొదలుపెడతాడు. ఎంతగా వెదికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు. వాళ్లు తప్పనిసారిగా నీటియందే దాచి ఉంచి ఉంటారు. అవి దొరక్కుండా తాను బయటికి వెళ్లకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు.

శంఖుడు సముద్ర గర్భాన ఉండటంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు. బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు. ఆ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు. అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో, మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ .. కీర్తిస్తూ స్వామిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పుతారు. అప్పుడు స్వామి నిద్రలేచి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించినవారికి సకల శుభాలు చేకూరతాయని అభయమిస్తాడు.

వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు, శంఖుడి ఆగడాలను గురించి వివరిస్తారు. వేదాలకు ఆపద వాటిల్లనుందని చెబుతారు. వేదాలను దక్కించుకోవడానికి శంఖుడు సముద్ర గర్భంలో వెదుకుతున్నాడని అంటారు. శంఖుడి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదనీ, వాడి సంహారానికి సమయం ఆసన్నమైనదని విష్ణుమూర్తి చెబుతాడు. శంఖుడిని అంతం చేయడానికి తాను మత్స్య రూపాన్ని ధరించనున్నానని అంటాడు. మత్స్యావతార ప్రయోజనం అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.

కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిలిలోకి చేపపిల్ల వస్తుంది. ఆ చేప పిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలం అంతా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటిని కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు.

సముద్రంలోకి విడిచిపెట్టబడిన ఆ చేప, తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ, నీటి అడుగుకు చేరుకుంటుంది. ఒక వైపున వేదాల కోసం శంఖుడు వెదుకుతూ ఉంటే, మరొక వైపున శంఖుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెదుకుతూ ఉంటాడు. చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకుని సంహరించి వేదాలను రక్షిస్తాడు. శంఖుడిని శంఖంగా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు. అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదరీ వనంలో సేదతీరుతాడు. దేవతలు … మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు.

తాను అడుగుపెట్టిన కారణంగా బదరికవన ప్రదేశం మహా పుణ్యస్థలిగా మారుతుందనీ, భవిష్యత్తులో ఇది గంగ – కాళింది సంగమస్థానం అవుతుందని అంటాడు. అక్కడ చేసే జపతాపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు. బదరీ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు .. దోషాలు నసిస్తాయని అంటాడు. ఇతర క్షేత్రాల్లో ఏళ్లతరబడి చేసే పూజలు .. సేవలు .. తపస్సులు బదరీలో ఒక్క రోజున చేసినా అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు. బదరీలో చేసే పితృకార్యాల వలన, వాళ్ల పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. బదరీ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో, కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.