కైలాసానికి దూతగా వెళ్లిన రాహువు, అక్కడి నుంచి తిరిగివచ్చి చెప్పిన మాటలు జలంధరుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తాయి. దాంతో శివుడిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అనేకమంది సైన్యంతో కైలాసం పైకి యుద్ధానికి బయల్దేరతాడు. ఈ విషయం దేవతలకు తెలుస్తుంది. వాళ్లంతా కూడా ముందుగానే కైలాసానికి చేరుకుంటారు. జలంధరుడి ఆగడాల వలన తాము పడుతూ వస్తున్న కష్టాలను గురించి చెబుతారు. లోక కల్యాణం కోసం జలంధరుడిని సంహరించవలసిందిగా కోరతారు.

అప్పుడు పరమశివుడు .. విష్ణుమూర్తిని గురించి ప్రస్తావిస్తాడు. ఆయన లక్ష్మీదేవితో పాటు జలంధరుడి ఇంటనే ఉంటున్నాడని దేవతలు చెబుతారు. దాంతో ఆయన విష్ణుమూర్తిని తలచుకుంటాడు. క్షణాల్లో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఆయన ధోరణి పట్ల పరమశివుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. జలంధరుడు ఆయన అంశతో జన్మించడం వలన .. ఆయన మరణం తన చేతిలో లేకపోవడం వలన తాను అలా చేయవలసి వచ్చిందని విష్ణుమూర్తి చెబుతాడు.

శివతేజస్సుతో మాత్రమే జలంధరుడి సంహారం జరుగుతుందని శ్రీమహావిష్ణువు చెబుతాడు. ఆయన అత్యంత శక్తిమంతమైన తన తేజస్సును ఆవిష్కరిస్తాడు. దేవతలంతా తమ శక్తిని కూడా ఆ తేజస్సులో ఐక్యం చేస్తారు. ఆ తేజస్సుతో సదాశివుడు ఒక “సుదర్శన చక్రం” సృష్టిస్తాడు. ఇంతలో జలంధరుడి సైన్యం దేవతలపై విరుచుకుపడుతుంది. దేవతలకు .,. దానవులకు మధ్య భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. జలంధరుడి ధాటిని తట్టుకోవడం కష్టంగా మారుతుంది. దాంతో విఘ్నేశ్వరుడు .. వీరభద్రుడు .. కుమారస్వామి .. నందీశ్వరుడు అంతా కూడా రంగంలోకి దిగుతారు.

యుద్ధభూమిలో మరణించిన అసురులను శుక్రాచార్యుడు తిరిగి బ్రతికిస్తూ ఉండటంతో, అలాంటి అవకాశం లేకుండా “కృత్య” అనే శక్తిని సృష్టించి వదులుతాడు శివుడు. “కృత్య” ఒక్కసారిగా అసురులపై విరుచుకుపడుతుంది. శుక్రాచార్యుడు యుద్ధభూమిలో కనిపించకుండా చేస్తుంది. జలంధరుడిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన వీరభద్రుడు ఆయన చేతిలో స్పృహ కోల్పోతాడు. దాంతో ఇక సాక్షాత్తు సదాశివుడే రంగంలోకి దిగవలసి వస్తుంది. జలంధరుడి భార్య “బృంద” పాతివ్రత్యం కారణంగానే ఆయనను ఎవరూ ఎదురించలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించిన విష్ణుమూర్తి, తరుణోపాయాన్ని ఆలోచిస్తాడు.

జలంధరుడు యుద్ధానికి వెళ్లడం వలన ఆయన భార్య బృంద ఆయన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది. ఆయన ఎలా ఉన్నాడనే విషయం చెప్పమంటూ ఒక మహర్షిని అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి పిలవగానే కొన్ని కోతులు అక్కడికి వస్తాయి. అవి ఏం చేయాలనేది ఆ మహర్షి సూచిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిన ఆ కోతులు కొంతసేపటికి తిరిగి వస్తాయి. ఆ కోతుల చేతుల్లో జలంధరుడి తెగిపడిన అవయవాలు ఉండటం చూసి బృంద కన్నీళ్ల పర్యంతమవుతుంది. తన భర్తను బ్రతికించమని కోరుతుంది.

శివుడితో వైరం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ ఆ మహర్షి చెబుతాడు. అయినా ఆమె బాధను చూడలేక ఆయనను బ్రతికిస్తానని చెప్పి అదృశ్యమవుతాడు. తెగిపడిన అవయవాలను కలుపుకుంటూ జలంధరుడు ఈ లోకంలోకి వస్తాడు. అందుకు బృంద ఎంతగానో ఆనందిస్తూ భర్తను హత్తుకు పోతుంది. ఇద్దరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తన భర్త బ్రతికి వచ్చాడనే ఆనందంలో ఉన్న బృంద, ఆయన ధోరణిలోను .. స్పర్శలోను గల మార్పును గ్రహిస్తుంది. వచ్చినది తన భర్త కాదు .. శ్రీహరి అనే విషయాన్ని పాతివ్రత్య మహిమతో గ్రహిస్తుంది.

తన పాతివ్రత్యాన్ని భంగపరచడానికి వచ్చిన విష్ణుమూర్తిపై మండిపడుతుంది. ఆయన చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంటుంది. తనని మాయ చేయడానికి .. నమ్మించడానికి ఆయన సృష్టించిన కోతులు రాక్షసులై ఆయన భార్యను అపహరిస్తారని శపిస్తుంది. భార్య వియోగాన్ని అనుభవిస్తూ ఆయన అడవులు పట్టుకుని తిరుగుతాడని అంటుంది. తన శాపం వృథా కాదని చెప్పేసి అగ్నిలో దూకేసి ఆత్మత్యాగం చేసుకుంటుంది. బృంద ఆ విధంగా చేయడం శ్రీమహావిష్ణువును ఎంతగానో బాధిస్తుంది.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.