విష్ణుమూర్తి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగినవారు మాత్రమే విష్ణు లోకానికి చేరుకుంటారని ధర్మదత్తుడితో విష్ణుదూతలు చెబుతారు. అయితే జయ విజయులకు వైకుంఠంలో స్వామివారి ద్వారపాలకులుగా ఆ స్థానాలు ఎలా లభించాయని ధర్మదత్తుడు విష్ణుదూతలను అడుగుతాడు. అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలు పెడతారు. తృణబిందుడి కుమార్తె అయిన “దేవహూతి”కి, కర్దమ ప్రజాపతి కారణంగా ఇద్దరు మగ శిశువులు కలుగుతారు .. వారే జయవిజయులు.

జయవిజయులు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. శ్రీమన్నారాయణుడి సేవ పట్ల వారు ప్రాణం పెడుతూ ఉంటారు. వయసుతో పాటు వారిలో భక్తి కూడా పెరుగుతూ వస్తుంది. అనేక యజ్ఞయాగాలను నిర్వహించి వారు స్వామి సాక్షాత్కారాన్ని పొందుతారు. అంతటి భక్తులు .. నియమ నిష్టాపరులైన వారితో యజ్ఞయాగాలు చేయించడానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి ఆ ఇద్దరితో “మరుత్తు” అనే రాజు ఓ యజ్ఞం చేయిస్తాడు. ఇద్దరూ కూడా ఎంతో గొప్పగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తారు.

అందుకు సంతృప్తి చెందిన ఆ రాజు, పెద్ద మొత్తంలో వారికి దక్షిణ సమర్పించి వెళ్లిపోతాడు. అయితే ఆ దక్షిణ విషయంలో అన్నదమ్ములకు గొడవ జరుగుతుంది. ఆగ్రహించిన జయుడు .. మొసలివైపొమ్మని విజయుడిని శపిస్తాడు. ఆయన కూడా కోపించి ఏనుగులా మారిపొమ్మని జయుడిని శపిస్తాడు. ఇద్దరూ ఆ శాపాలను అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి సెలవిస్తాడు. దాంతో గండకీ నదీ తీరంలో ఏనుగులా .. అక్కడి ఓ సరస్సులో మొసలిగా ఆ ఇద్దరూ జీవిస్తూ ఉంటారు.

అది కార్తీక మాసం కావడంతో స్నానం చేయాలనే ఉద్దేశంతో ఏనుగు సరస్సులోకి దిగుతుంది. అది చూసిన మొసలి … ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది. ఒడ్డుకు చేరుకోవాలని ఏనుగు ప్రయత్నిస్తూ ఉంటే, లోపలికి లాగాలని మొసలి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న జయుడు ప్రార్ధించడంతో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రంతో మొసలి శిరస్సును ఖండిస్తాడు. అలా జయ విజయులకు శాప విమోచనం కలిగి, తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు. “అలా నీవు అహంభావానికి వెళ్లకుండా .. ఆవేశాలకు పోకుండా స్వామిని సేవించి తరించు” అని ధర్మదత్తుడితో చెప్పిన విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్లిపోతారు.

నారద మహర్షి చెప్పిన విషయాలన్నింటినీ విన్న పృథు మహారాజు, మహిమాన్వితమైన ఈ సంఘటనలు ఆయా క్షేత్రాలకు చెందుతాయా? నదులకు చెందుతాయా? అని అడుగుతాడు. అప్పుడు నదులను గురించి నారద మహర్షి చెప్పడం మొదలుపెడతాడు. చాక్షుష మన్వంతరంలో బ్రహ్మకు మహర్షులు యజ్ఞ దీక్షను ఇస్తుంటారు. అందుకు ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు. ముహూర్త సమయం అవుతున్నా సరస్వతీదేవి రాకపోవడంతో, ఏమిటి చేయడం? అని భృగు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు.

సరస్వతీదేవి కోసం ఎదురుచూసే సమయం లేకపోవడం వలన, బ్రహ్మ దేవుడికి మరో భార్య అయిన గాయత్రిని ఆహ్వానించి కార్యక్రమాన్ని నడిపించమని విష్ణుమూర్తి చెబుతాడు. భృగు మహర్షి అలాగే చేస్తాడు. అదే సమయంలో సరస్వతీదేవి అక్కడికి చేరుకుంటుంది. తన స్థానంలో గాయత్రిని ఉంచి కార్యక్రమాన్ని నడిపించడం పట్ల ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. ఒక రకంగా తనని అవమానపరచడమేనంటూ అసహనాన్ని ప్రదర్శిస్తుంది. వాళ్లంతా కూడా నదీ రూపాలను పొందాలంటూ శపిస్తుంది.

సరస్వతీదేవి ధోరణి పట్ల గాయత్రి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. తాను కూడా బ్రహ్మకి భార్యనే అనే విషయాన్ని మరిచిపోవద్దని అంటుంది. తాము నదులుగా మారిపోయేలోగా ఆమె కూడా నదిగా మారిపోవాలని ప్రతి శాపం ఇస్తుంది. అలా సరస్వతీదేవి శాపం వలన బ్రహ్మ .. విష్ణు మహేశ్వరులు .. గాయత్రి నదులుగా మారిపోయి తూర్పు దిశగా ప్రవహించడం మొదలుపెడతారు. సరస్వతీదేవి శాపం వలన గాయత్రి … ఆమె శాపం వలన సరస్వతీదేవి ఇద్దరూ కూడా నదులుగా మారిపోయి పడమర దిశగా ప్రవహించడం మొదలుపెడతారు. ఈ కథ అంతా విన్నవారికి నదీస్నానం చేసిన ఫఫలితం కలుగుతుందని పృథు చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.