Varanasi – Sri Kashi Vishwanath Temple

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో “కాశీ” ఒకటిగా కనిపిస్తుంది. గంగానది తీరంలోని ఈ క్షేత్రం శివుడి సృష్టి అని చెబుతారు. ప్రళయకాలంలో పరమశివుడు కాశీ నగరాన్ని తన త్రిశూలంపై నిలబెట్టి కాపాడుతూ వస్తున్నాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీని బట్టి కాశీ క్షేత్రం ఎన్ని యుగాల నుంచి ఉందనేది .. ఇక్కడి పరమశివుడు ఆవిర్భవించినది ఎప్పుడనేది చెప్పడం కష్టం. ఈ క్షేత్రంలో వరుణ – అసి అనే రెండు నదులు గంగానదిలో కలవడం వలన ఈ క్షేత్రానికి “వారణాసి” అనే పేరు వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని “కాశీ” పరమశివుడి లీలా విశేషాలకు వేదికగా కనిపిస్తుంది. ఆయనను లయకారకుడుగా అర్థం చేసుకోవడానికి అనువైన క్షేత్రంగా అనిపిస్తుంది. నిజంగానే ఆయన విశ్వనాథుడు .. భూతపతి అనే విషయం ఇక్కడ బోధపడుతుంది. అమ్మవారు విశాలాక్షిగాను .. అన్నపూర్ణమ్మ తల్లిగాను ఇక్కడ పూజలు అందుకుంటుంది. గంగాతీరంలో అనేక స్నానఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఘట్టాలు ఎన్నైనా గంగ ఒకటే ఆయనట్టు .. చివరికి అందరూ చేరుకునేది ఆ పరమశివుడి పాదాల చెంతకే అనే విషయం అవగాహనలోకి వస్తుంది.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా .. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం దర్శించడానికి పూర్వజన్మ పుణ్యం ఉండాలని అంటారు. వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నాడట. హరిశ్చంద్రుడు ఇక్కడ తిరుగాడినాడట .. తులసీదాస్ ఫలానా చోట కూర్చున్నాడట వంటి విషయాలు విన్నప్పుడు మనసు కాస్త బరువెక్కుతుంది. కాశీ చేరుకున్న భక్తులు ముందుగా గంగా స్నానం చేసి .. క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుంటారు.

ఆ తరువాత కాశీవిశ్వనాథుడిని .. విశాలాక్షి అమ్మవారిని .. అన్నపూర్ణమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడ సతీదేవి “చెవి కుండలం” పడిపోవడం వలన శక్తి పీఠమైంది. ఇక్కడి గణపతి ఆలయాలలో సాక్షి గణపతి ఆలయం .. డుండి గణపతి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. కాశీ క్షేత్రాన్ని దర్శించామనడానికి సాక్షిగా సాక్షి గణపతి ఉన్నాడని అంటారు. ఇక ఆ తరువాత సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తులసీదాస్ తో ముడిపడిన ఇక్కడి ఆలయం భక్తి భావనను మరింత పెంచుతుంది.

ఇక ఈ క్షేత్రంలో ద్వాదశ ఆదిత్యులు ప్రత్యేకమైన మందిరాలలో కొలువై దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో ప్రత్యేకత .. విశేషం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే “వారాహి దేవి”ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారిని నేరుగా కాకుండా ఆలయంలోని ఒక భాగంలోని రంధ్రాల ద్వారా దర్శిస్తారు. అమ్మవారి రూపాన్ని నేరుగా చూడలేరని అంటారు. ఇక్కడ సంధ్యా సమయంలో గంగ హారతులు చూడవలసిందే. గంగానదీ తీరంలో చాలా మంది పిండ ప్రధానాలు చేస్తుంటారు. జీవితంలో వ్యామోహాల నుంచి బయటపడి .. వైరాగ్యం దిశగా అడుగులు వేసి .. మోక్షాన్ని కోరుకునే దిశగా ఆలోచన కలిగించేదిగా కాశీ దర్శనం అనిపిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Varanasi – Sri Kashi Vishwanath Temple