దేవతలు .. దానవులు సముద్ర గర్భాన్ని చిలకడానికి సిద్ధమవుతారు. మందర పర్వతానికి వాసుకి సర్పాన్ని త్రాడుగా చుడతారు. వాసుకి తలభాగం వైపు తాము ఉంటామనీ .. అధమ భాగమైన తోక భాగాన్ని తాము పట్టుకోమని దానవులు పట్టుపడతారు. అందుకు దేవతలు అంగీకరించి వాళ్లే తోక వైపుకు వస్తారు. సముద్రగర్భాన్ని చిలకడం మొదలవుతుంది. ఆ రాపిడిని తట్టుకోలేక వాసుకి సర్పం బుసలు కొడుతూ ఉంటుంది. ఆ విషవాయువు ధాటికి దానవులు తట్టుకోలేక పోతుంటారు. వాళ్ల అవస్థలు చూసిన దేవతలు ఏది జరిగినా అది తమ మంచికే అనుకుంటారు.

సముద్ర గర్భాన్ని చిలుకుతుండటంతో మందర పర్వతం ఒక్కసారిగా సముద్రగర్భాన మునిగిపోతుండటం మొదలవుతుంది. అది గమనించిన దేవతలు .. దానవులు ఆందోళనతో కేకలు వేస్తారు. దేవతల అభ్యర్థన మేరకు శ్రీమహావిష్ణువు “కూర్మావతారం” ధరిస్తాడు. కూర్మావతారం ధరించిన శ్రీమహావిష్ణువును చూసిన దేవతలంతా ఆశ్చర్యపోతారు. కూర్మావతారంలో విష్ణుమూర్తి సముద్రగర్భంలో ప్రవేశిస్తాడు. మందరపర్వతం తన వీపు భాగంపై నిలిచేలా కూర్మావతారం యొక్క రూపాన్ని విశాలంగా పెంచుతాడు. అలా మందరపర్వతాన్ని తన వీపు భాగంపై నిలుపుతాడు.

దేవతలు .. దానవులు చిలకడానికి వీలుగా విష్ణుమూర్తి మందర పర్వతాన్ని మళ్లీ కొద్దిగా పైకి ఎత్తుతాడు. దాంతో వాళ్లు ఉత్సాహంతో మళ్లీ చిలకడం మొదలుపెడతారు. అలా చిలుకుతూ ఉండగా ఒక్కసారిగా హాలాహలం బయటికి వస్తుంది. ఆ విషప్రభావానికి తట్టుకోలేక దేవతలు .. దానవులు ఉక్కురిబిక్కిరి అవుతుంటారు. సముద్రగర్భాన్ని చిలకలేరు .. అలా అని చెప్పేసి వదిలిపెట్టలేరు. దేవతల అభ్యర్థన మేరకు పరమశివుడు రంగంలోకి దిగుతాడు. భయంకరమైన ఆ కాలకూట విషాన్ని, లోక కల్యాణం కోసం ఆయన సేవిస్తాడు.

పొగలు చిమ్ముతున్న ఆ కాలకూట విషాన్ని శివుడు సేవిస్తాడు. ఆ విషం తన కడుపులోకి వెళ్లకుండా కంఠంలోనే దాచుకుంటాడు. దాంతో ఆ విషప్రభావం వలన ఆయన కంఠం నీలంగా మారిపోతుంది. అప్పటి నుంచి సదాశివుడు .. నీలకంఠుడు అయ్యాడు. లోక కళ్యాణం కోసం గరళాన్ని సేవించిన శంకరుడికి దేవతలు జేజేలు పలుకుతారు.ఆ ఉత్సాహంతో మరింత వేగంగా క్షీరసాగర మథనం సాగిస్తారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.