దేవతలు .. దానవులు పట్టువదలక సముద్రగర్భాన్ని చిలుకుతూనే ఉంటారు. అలా చిలుకుతూ ఉండటంతో, సముద్ర గర్భం నుంచి కామధేనువు .. శ్వేతాశ్వం .. ఐరావతము .. కల్పవృక్షము .. అప్సరసలు .. లక్ష్మీదేవి .. కౌస్తుభము వెలువడతాయి. ఆ తరువాత అమృతకలశముతో ధన్వంతరి వస్తాడు. ఏ అమృత భాండం కోసం తాము ఇంతగా కష్టపడ్డారో, ఆ అమృతాన్ని చూడగానే దానవులు సంతోషంతో పొంగిపోతారు. వెంటనే దేవతలను పక్కకి తోసేసి ఆ కలశాన్ని దక్కించుకుంటారు. ఊహించని ఈ పరిణామానికి వాళ్లంతా నివ్వెరపోతారు.

దానవుల నుంచి అమృతభాండాన్ని దక్కించుకోవడానికి దేవతలు తమ శక్తిమేర ప్రయత్నిస్తారు. కానీ దానవుల నుంచి ఆ అమృతకలశాన్ని దక్కించుకోలేకపోతారు. ఆలస్యం చేస్తే తమకి ఇవ్వకుండానే దానవులు అమృతాన్ని సేవించేలా ఉన్నారని ఆందోళనకు లోనవుతారు. పరిస్థితిని అర్థం చేసుకున్న విష్ణుమూర్తి “మోహిని” రూపాన్ని ధరిస్తాడు. దానవులు సౌందర్యానికి బానిసలు .. ఆ సౌందర్యంతోనే వాళ్ల దృష్టిని మళ్లించి అమృతాన్ని దేవతలు మాత్రమే సేవించేలా చేయాలని నిర్ణయించుకుంటాడు.

అమృతభాండం పట్టుకుని దానవులు ఉత్సాహంతో నాట్యం చేస్తుంటారు. ఇక తమకి మరణం అనేది ఉండదనీ, దేవతలు తమకి ఎప్పటికీ బానిసలుగా పడి ఉండవలసిందేనని చెప్పుకుని సందడి చేస్తూ ఉంటారు. అదే సమయంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి వాళ్ల ముందుకువస్తాడు. అప్పటివరకూ అమృతకలశం చుట్టూనే గుమిగూడిన దానవులు ఒక్కసారిగా మోహిని వైపు తిరుగుతారు. అంతటి సౌందర్యరాశిని అంతవరకూ చూడని కారణంగా, తమని తాము మరిచిపోతారు. అమృతభాండం పట్టుకునే, మోహిని సౌందర్యాన్ని దగ్గరగా చూడటానికి ఎగబడతారు.

మోహిని ఓరకంటితో దానవులను చూస్తుంది .. సిగ్గులు ఒలకబోస్తూ అదోలా నవ్వుతుంది. అందమైన ఆమె నవ్వు .. ఆ నడకలోని వయ్యారం చూసి దానవులు సమ్మోహితులవుతారు. మోహిని ఎటువైపు వెళితే దానవులు అటువైపు వెళుతూ ఉంటారు. వాళ్లలో వారే ఒకరిని ఒకరు పట్టించుకోని పరిస్థితికి చేరుకుంటారు. ఇక దేవతలు ఏమైపోయారో .. ఏం చేస్తున్నారో కూడా వాళ్లకి పట్టదు. వాళ్లందరి దృష్టి మోహినిపైనే ఉంటుంది. మోహినినే కళ్లప్పగించి చూస్తూ ఆమె చుట్టూ చేరతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.