శ్రీమహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీరాముడిగా .. శ్రీకృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అయితే సత్యనారాయణస్వామిగా ఆయన ఆవిర్భవించిన సందర్భాలు .. ప్రదేశాలు చాలా తక్కువ. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా “జైనాథ్” కనిపిస్తుంది. తెలంగాణ – ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి ఆలయాన్ని .. నల్లరాతి పలకలతో చేసిన నిర్మాణాన్ని చూడగానే ఇది చాలా ప్రాచీనమైన క్షేత్రం అనే విషయం అర్థమైపోతుంది. ఎంతోమంది రాజవంశీకులు .. మహాభక్తులు స్వామివారిని సేవించుకున్నారనే విషయం స్పష్టమైపోతుంది.

క్రీ.శ.13వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి ఇక్కడ రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో జైనులు ఎక్కువగా ఉండేవారట. వాళ్లంతా ఇక్కడి స్వామిని సేవించేవారని అంటారు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి జైన క్షేత్రమనీ .. జైనాథ క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక పూర్వం ఈ ప్రదేశంలో నారాయణ అనే భక్తుడు శ్రీమహావిష్ణువును గురించి తపస్సు చేశాడట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అన్నారు.

స్వామివారు అక్కడ స్వయంభువుగా ఆవిర్భవించి తాను ఉన్నంతవరకూ తనతో .. ఆ తరువాత భక్తులతో పూజాభిషేకాలు అందుకోవాలని కోరాడట. అప్పుడు స్వామివారు తాను “జయనాథస్వామి” గా పూజలు అందుకుంటానంటూ ఆ క్షణమే స్వయంభువుగా మారిపోయాడని అంటారు. అప్పట్లో జయనాథ క్షేత్రంగా పిలవబడిన ఈ క్షేత్రం, ఆ తరువాత కాలంలో “జైనాథ్” గా మారిపోయిందని అంటుంటారు. ఇక ఈ ఆలయాన్ని పరిశీలనగా చూస్తే నిర్మాణాన్ని మధ్యలో ఆపేసినట్టుగా కొన్ని శిధిలాలు కనిపిస్తాయి.

అప్పట్లో ఈ ఆలయాన్ని ఒకే ఒక రాత్రిలో నిర్మించాలని సంకల్పించుకున్నారట. నిర్మాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని .. ఒక శుభ ముహూర్తాన రాత్రివేళలో నిర్మాణం పనులను మొదలుపెట్టారట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం చాలావరకూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంకా కొంతపని ఉండగానే తెల్లారి పోవడంతో అంతటితో ఆ పనులను ఆపేశారు. అప్పటి నుంచి ఆ పనులను పూర్తి చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం విలసిల్లుతూ ఉంటుంది.

గర్భాలయంలోని స్వామివారిని భక్తులు జైనాథ సత్యనారాయణ స్వామిగా కొలుస్తూ ఉంటారు. స్వామివారి కుదురైన రూపం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. సెప్టెంబర్ .. అక్టోబర్ మాసాల్లో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. “కార్తీక శుద్ధ పౌర్ణమి” రోజున ఇక్కడ సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహిస్తుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.