శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి. లోక కల్యాణం కోసం .. హిరణ్య కశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం కూడా ఆ స్వామి ఆగ్రహోజ్వాలలు చల్లారలేదు. అలా ఉగ్రత్వంతోనే అనేక ప్రాంతాల్లో స్వామి తిరుగాడుతూ ఆయా ప్రదేశాల్లో ఆవిర్భవించడం జరిగింది. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా “నర్సింహులు పల్లె” కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జిల్లా కేంద్రానికి సమీపంలోగల ఈ గ్రామంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
ఇక్కడి “నందగిరి”పై పంచముఖాలతో .. పదహారు చేతులతో స్వామివారి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ కొండకి నందగిరి అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం మలయ పర్వతానికి రెక్కలు ఉండేవట. ఆకాశంలో ఆ పర్వతం విహరిస్తున్నప్పుడు భూలోకంలోని ప్రాంతాలు చీకట్లోకి జారిపోయేవట. అది గమనించిన దేవేంద్రుడు మలయా పర్వతం యొక్క నాలుగు రెక్కలను ఖండించివేస్తాడు. ఆ నాలుగు రెక్కలు నాలుగు ప్రాంతాలలో పడిపోయాయి.
దేవేంద్రుడు ఈ విధంగా చేయడాన్ని గురించి మలయపర్వతం శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకోగా, ఆ నాలుగు పర్వతభాగాలు పడిన ప్రదేశాలు పుణ్య క్షేత్రాలకు నివాస స్థానమై పూజలందుకుంటాయని వరమిస్తాడు. మలయ పర్వతం నుంచి ఖండించి వేయబడిన ఆ నాలుగు భాగాలు మంగళగిరి .. వేదగిరి .. యాదగిరి .. నందగిరిగా ప్రసిద్ధి చెందాయని అంటారు. ఇక పూర్వం ఈ ప్రాంతాన్ని నందరాజులు పాలించడం వలన ఈ ప్రదేశానికి నందగిరి అనే పేరు వచ్చిందని కొందరంటే, నంద మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన ఈ పేరు వచ్చిందని మరికొందరు చెబుతుంటారు.
ఇక్కడి కొండ పైభాగానికి చేరుకుంటే గుహనే గుడిగా మార్చిన తీరు కనిపిస్తుంది. గుహలో స్వామివారి మూలమూర్తిని దర్శనం చేసుకోవచ్చును. స్వామివారు ఇక్కడ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఎన్నో రాజవంశాలు వారు ఈ క్షేత్ర విశిష్టతను కాపాడుతూ వచ్చారనే విషయం స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది. శాతవాహనులు .. చోళ రాజులు .. కాకతీయులు .. స్వామివారి వైభవానికి కృషి చేశారని అంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు .. ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.
ఆది శంకరులవారు ఈ క్షేత్ర దర్శనం చేసుకుని, ఇది అత్యంత శక్తిమంతమైన క్షేత్రమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎంతోమంది భక్తులు ఈ స్వామివారిని సేవించి తరించినట్టుగా చెబుతారు. అనేక ఉపాలయాలు .. మంటపాలు .. పుష్కరిణి కలిగిన ఈ క్షేత్రం అలనాటి వైభవానికి అద్దం పడుతుంటుంది. ప్రతి ఏడాది “చైత్ర శుద్ధ ఏకాదశి” రోజు నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రాతంభమవుతాయి. ప్రత్యేకమైన సేవలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.