Pallikondeswara Swamy Temple Surutapalli

సాధారణంగా శ్రీమహావిష్ణువు కొన్ని క్షేత్రాలలో శయనమూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. “శ్రీరంగం” వంటి క్షేత్రాలలో మాదిరిగా స్వామివారు శయన భంగిమలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి శయన ముద్రలో పరమశివుడు మాత్రం కనిపించడు. శివుడు దాదాపు లింగరూపంలోనే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. విగ్రహ రూపంలో ఆయన కొలువైన క్షేత్రాలు చాలా తక్కువ. అయితే శ్రీ మహావిష్ణువు మాదిరిగానే సదాశివుడు శయనముద్రలో దర్శనమిచ్చే క్షేత్రం ఒకటి ఉంది .. అదే “సురుటుపల్లి”(Surutapalli).

ఆంధ్రప్రదేశ్ .. చిత్తూరు జిల్లా .. నాగలాపురం మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో .. భారీ నిర్మాణాలతో ఈ ఆలయం ప్రాచీనతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. లింగరూపంలో దర్శనమిచ్చే శివయ్య ఇక్కడ విగ్రహరూపంలో ఎందుకు శయన మూర్తిగా కనిపిస్తున్నాడు? పైగా పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని సేదతీరుతున్నట్టుగా ఉండటానికి కారణం ఏమిటి? అనే సందేహాలు భక్తులకు కలగడం సహజం. క్షీరసాగర మథనంతో ఇక్కడి స్వామివారికి ముడిపడి ఉండటం విశేషం.

దేవతలు .. దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు పొగలు కక్కుతూ విషం వెలువడుతుంది. అప్పుడు పరమశివుడు ఆ కాలకూటవిషాన్ని “నేరేడుపండు” పరిమాణంలోకి మార్చేసి దానిని తన కంఠంలో దాచుకుంటాడు. అయితే ఆ విషప్రభావానికి తట్టుకోలేక ఆయన నేలపై వాలిపోతాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి ఆయన శిరస్సును తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. దేవతలంతా పరమశివుడికి ఉపశమనం కోసం అనేక సేవలు చేయడం మొదలు పెడతారు. కొంతసేపటికి ఆ స్వామి కనులు తెరుస్తాడు.

విషప్రభావం వలన శివుడి కంఠం నీలం రంగులోకి మారడం వలన, ఆయనను నీలకంఠుడు అని అంటారు. కాలకూట విషప్రభావం కూడా ఆయనను ఏమి చేయలేకపోవడానికి కారణం సర్వమంగళ అయిన అమ్మవారేనని అంటారు. ఆ సమయంలో సురులు అంతా ఆ ప్రదేశంలోనే ఉన్నందు వలన ఈ ప్రదేశానికి సురులపల్లి అనే పేరు వచ్చిందనీ .. అదే కాలక్రమంలో “సురుటుపల్లి”గా మారిందని చెబుతారు. తమిళ భక్తులు స్వామివారిని “పళ్లికొండేశ్వరుడు”గా పిలుచుకుంటూ ఉంటారు.

ఎక్కడా లేని విధంగా గర్భాలయంలో స్వామివారు అమ్మవారి ఒడిలో తలపెట్టుకుని శయన ముద్రలో కనిపించడమే ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. శివపార్వతులతో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టుగా బ్రహ్మ .. విష్ణు .. మహర్షులు కూడా దర్శనమిస్తూ ఉంటారు. ముక్కోటి దేవతలు నడయాడిన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఎంతోమంది పురాణ పురుషులు .. మహారాజులు .. మహాభక్తులు ఇక్కడి స్వామిని సేవించి తరించారు. విశేషమైన పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్ర దర్శనం వలన ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Pallikondeswara Swamy Temple Surutapalli