Puri Jagannath Temple Odisha

సాధారాణంగా ఏ క్షేత్రంలో నైనా స్వామివారు – అమ్మవారు కలిసి కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటారు. అలా కాకుండా అన్నలు – చెల్లెలు కలిసి కొలువై పూజలందుకోవడం ఎక్కడా కనిపించదు. అలాంటి ఒక అరుదైన క్షేత్రంగా “పూరి” కనిపిస్తుంది. ఒడిశా రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ జగన్నాథుడు .. బలరాముడు .. సుభద్ర కొలువైన తీరు .. వారి ప్రతిమలు రాతితో కాకుండా చెక్కతో ఉండటం .. గర్భాలయంలోని ప్రతిమలు వేరు వేరుగా ఊరేగింపుకి వెళ్లడం ఆశ్చర్యంగా .. విశేషంగా అనిపిస్తుంది.

పూరి ఆలయంలో ఉన్నది ముగ్గురి ప్రతిమలు అయినప్పటికీ జగన్నాథస్వామి ఆలయమనే పిలుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతున్నప్పటికీ, పూరి అనగానే గుర్తుకు వచ్చేది రథయాత్రనే. ఇక్కడి జగన్నాథుడి లీలా విశేషాలలోకి వెళితే, పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మాధవస్వామిని ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఆయన కోరిక ఫలించాలని భార్య గుండికాదేవి కోరుకుంటుంది. అప్పుడు తాను జగన్నాథ .. బలరామ .. సుభద్ర .. అనే రూపాలతో దర్శనమిస్తాననే స్వామి వాక్కు వారికి వినిపిస్తుంది.

కొయ్య దుంగనే తాను చెప్పిన రూపాలుగా చెక్కించి .. పూజించమని స్వామి చెబుతాడు. దాంతో ఆ దంపతులు అందుకు సంబంధించిన పనుల్లో ఉంటారు. కొయ్య దుంగలను విగ్రహాలుగా మలుస్తానని వచ్చిన వ్యక్తికి ఆ బాధ్యతను అప్పగిస్తారు. తనకు విగ్రహాలను తయారు చేయడనికి 21 రోజులు పడుతుందనీ, ఈలోగా ఎవరూ అంతరాయం కలిగించవద్దని ఆ శిల్పి చెబుతాడు. అన్నపానాలు తీసుకోకుండా ఇది ఎలా సాధ్యమా అని చెప్పేసి ఆ దంపతులు ఆశ్చర్యపోతారు. ఆ శిల్పి కోసం కేటాయించిన ప్రత్యేకమైన గదిలో పని జరుగుతూ ఉంటుంది.

ప్రత్యేకమైన ఆ గదిలో కొయ్యను చెక్కే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. 15వ రోజున ఆ గదిలో నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో రాణి గుండికాదేవి కంగారుపడిపోయి ఒక్కసారిగా తలుపులు తోసి లోపలికి వెళుతుంది. లోపల శిల్పి లేకపోవడం .. విగ్రహాలు అసంపూర్తిగా ఉండటం చూసి ఆ దంపతులు బాధపడతారు. ఆ మూర్తులను అలా అసంపూర్తిగానే దర్శించుకుని .. పూజించవలసి ఉంటుందనే స్వామి వాక్కు వాటికి వినిపిస్తుంది. అలాగే తన రథోత్సవం ఎలా జరగాలనేది కూడా స్వామివారు సెలవిచ్చినట్టే జరుగుతోంది.

మధ్యలో సుభద్ర .. అటు ఇటు జగన్నాథుడు .. బలరాముడు గర్భా లయంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక పూరిలో అన్నప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇక్కడ ఎవరూ ఎక్కువా కాదు .. తక్కువా కాదు .. ఎంగిలి అనే మాటకు తావే లేదు అన్నట్టుగా ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. ప్రతి యేటా కూడా కొత్త రథాలను తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి ఉత్సవానికి ఉపాయోగించిన రథాలను మళ్లీ ఉపయోగించక పోవడం మరో విశేషం. వైశాఖ శుద్ధ తదియనాడు రథాల తయారీ మొదలవుతుంది. ఆషాడ శుద్ధ విదియనాడు రథయాత్ర జరుగుతుంది.

ఆ రోజున అక్కడి రాజ వంశీకులు రథాలు వెళ్లే మార్గంలో బంగారు చీపురుతో కొంతమేర ఊడవటమనేది ఆచారంగా వస్తుంది. అలా రథాలు “గుండీచయాత్ర” పేరుతో గుండీచ ఘర్ కి చేరుకుంటాయి. అక్కడ అనునిత్యం ప్రత్యేకమైన పూజలు అందుకుని, తొమ్మిదో రోజున అక్కడి నుంచి బయల్దేరి ఆలయానికి తిరిగొస్తాయి. దీనిని బాహుదా యాత్ర అని పిలుస్తారు. ఈ రథయాత్రలో పాల్గొన్న వారికి మోక్షం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువలన ఈ రథయాత్రలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారి దర్శనంతో .. నామ స్మరణతో తరిస్తుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Puri Jagannath Temple Odisha