Pedamuttevi Sri Lakshmipathi Swamy Temple
ప్రాచీన క్షేత్రాలు అడుగడుగునా భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ, ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. దేవతల కోరిక మేరకు .. మహర్షుల తపస్సు కారణంగా .. మహాభక్తుల అభ్యర్థన మేరకు భగవంతుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా పుణ్య స్థలాలుగా .. పుణ్య క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. మహర్షుల తపస్సుకు మెచ్చి .. వారి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు కొలువైన క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా “పెద ముక్తేవి”(Pedamuttevi) కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ .. కృష్ణా జిల్లా .. మొవ్వ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా తీర్చి దిద్దబడిన ఈ ఆలయం, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ప్రాచీన వైభవాన్ని కళ్లకు కడుతూ ఉంటుంది. కృష్ణా నదికి ఉపనదిగా ఉన్న భీమానది తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ ప్రాంతంలో వ్యాస మహర్షి .. అగస్త్య మహర్షి .. తిరుగాడినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా ఈ క్షేత్రం వ్యాస మహర్షితో ముడిపడినదిగా కనిపిస్తుంది.
పూర్వం ఈ ప్రదేశంలో శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారాన్ని కోరుతూ వ్యాస మహర్షి తపస్సు చేశాడట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండటం కోసం లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉండవలసినదిగా వ్యాస మహర్షి కోరడంతో, అందుకు అంగీకరించిన స్వామి స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచి కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రాచీనమైన లక్ష్మినారాయణుల క్షేత్రాలలో ఇది ఒకటిగా విలసిల్లుతోంది. మిగతా నాలుగు క్షేత్రాలు నల్లూరు .. రాచూరు .. అవనిగడ్డ .. నడికుదురులలో కనిపిస్తాయి.
లక్ష్మీసమేతుడైన స్వామివారు ఇక్కడ లక్ష్మీపతిస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామివారి ఎడమ తొడపై కూర్చుని రాజ్యలక్ష్మీదేవిగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. చతుర్భుజుడైన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడానికి రెండు కళ్లు చాలవు. ఇంతటి సౌందర్యమూర్తి మరెక్కడా లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ క్షేత్రానికి వెళ్లి వచ్చిన తరువాత కూడా స్వామివారి రూపం మనోఫలకంపై అలా నిలిచే ఉంటుంది. అమ్మవారు కూడా మహా సుకుమారిగా దర్శనమిస్తుంది.
ముక్తిని ప్రసాదించే క్షేత్రం కావడం వలన “ముక్తేవి”(Pedamuttevi) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వినాయకుడు కావడం విశేషం. ముందుగా వినాయకుడిని దర్శించుకున్న భక్తులు ప్రధాన దైవమైన లక్ష్మీపతి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది “చైత్ర శుద్ధ ఏకాదశి” మొదలు కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన దారిద్ర్య దుఃఖాలు తొలగిపోతాయనీ, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Pedamuttevi Sri Lakshmipathi Swamy Temple