Sri Bhagavatam – Punishments not working against Prahlad
ప్రహ్లాదుడి మాటతీరు హిరణ్యకశిపుడికి మరింత కోపాన్ని కలిగిస్తుంది. తమ రాజ్యంలో హరిభక్తులకు ఎలాంటి శిక్షలు అమలు జరుగుతున్నాయో, అవే శిక్షలను ప్రహ్లాదుడికి కూడా అమలుజరపమని ఆదేశిస్తాడు. పసివాడిపై పట్టుదలకు పోవద్దనీ, చిన్నపిల్లవాడిపై అంతటి ఆవేశం చూపడం సమంజసం కాదని లీలావతి చెబుతుంది. తామే నెమ్మదిగా నచ్చజెబుదామనీ, నిర్ణయాన్ని మార్చుకోమని అంటుంది. అయినా ఆమె మాటలను హిరణ్యకశిపుడు పట్టించుకోడు. అక్షరాలా తన ఆజ్ఞను పాటించమనే భటులకు చెబుతాడు.
రాజభటులు ఎన్నివిధాలుగా హింసించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రహ్లాదుడు భయపడకపోవడం హిరణ్యకశిపుడు సహనం కోల్పోయేలా చేస్తుంది. గదలతో .. శూలాలతో హింసించినా ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. దాంతో హిరణ్యకశిపుడు ఆలోచనలో పడతాడు. ప్రస్తుతం అమలుపరిచినవాటికంటే కఠినతరమైన శిక్షలను అమలుపరచాలని నిర్ణయించుకుంటాడు. తమ రాజ్యంలో అమలులో ఉన్న అన్నిరకాల కఠిన శిక్షలను ప్రహ్లాదుడి విషయంలో ఆచరణలో పెడుతూ వెళ్లమని భటులను ఆదేశిస్తాడు.
దాంతో వాళ్లు ప్రహ్లాదుడిని ఎత్తైన పర్వతాలపైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి క్రిందికి తోసేస్తామని భయపెడతారు. హరినామస్మరణ మానుకోమని అడుగుతారు. అందుకు ప్రహ్లాదుడు అంగీకరించకపోవడంతో అతనిని అక్కడి నుంచి తోసేస్తారు. రాజభవనానికి చేరుకుని, ప్రహ్లాదుడిని హతమార్చామని చెబుతారు. ఇక అతను తిరిగిరావడానికి అవకాశమే లేదని అంటారు. దాంతో లీలావతి కన్నీళ్ల పర్యంతమవుతుంది. హిరణ్యకశిపుడు కూడా ఆవేదన చెందుతాడు. అంతలో హరినామస్మరణ చేస్తూ అక్కడికి ప్రహ్లాదుడు రావడం చూసి ఆశ్చర్యపోతారు.
ప్రహ్లాదుడు కనిపించగానే హిరణ్యకశిపుడిలో ఆనందం .. అతని నోటివెంట హరినామస్మరణ వినగానే ఆగ్రహం. ఇక ఆలస్యం చేయకుండా ప్రహ్లదుడిని ఏనుగులతో తొక్కించమనీ .. సముద్రంలో విసిరివేయమని ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశిపుడు ఆదేశానుసారం భటులు అలాగే చేస్తారు. కానీ ఆ శిక్షలు కూడా ఆయనను ఏమీ చేయలేకపోతాయి. దాంతో వాళ్లంతా వచ్చి ఎలాంటి శిక్షలు కూడా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతున్నాయనీ, ఆయుధాలు ఏవీ ఆయనపై పనిచేయడం లేదని చెబుతారు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.