Ramayanam – 44 : Rama Lakshmana moves forward with Vanara sena
లంకాధిపతి అయిన రావణుడిని సంహరించి, ఆయన చెర నుంచి సీతమ్మను విడిపించుకు రావాలని రాముడు భావిస్తాడు. అందుకు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. ముహూర్త సమయానికి కోట్లాదిమంది వానర సైనికులు అక్కడికి చేరుకుంటారు. రాముడు వారినందరిని కొన్ని సమూహాలుగా విభజిస్తాడు. ఆ సమూహాల నాయకత్వ బాధ్యతలను సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, ఋషభుడు, వేగదర్శి, శతబలి వంటి వానర వీరులకు అప్పగిస్తాడు. పరిస్థితులను బట్టి ఎలా నడచుకోవాలనేది వాళ్లకి వివరిస్తాడు.
రాముడి నుంచి అనుమతి లభించినదే తడవుగా జయజయ ధ్వానాలు చేస్తూ వానర సేనలు ముందుకు కదులుతాయి. వానర సమూహాలు పెద్ద సంఖ్యలో ముందుకు సాగుతుంటాయి. ఆయా సమూహాలకు చెందిన వానర వీరులు రాముడి చెప్పినట్టుగా తమ బృందాలను నడిపిస్తూ వెళుతుంటారు. ఆ సమూహాల కదలికలను గమనిస్తూ రామలక్ష్మణులు సాగుతుంటారు. అలసిపోయినప్పుడు ఆగుతూ, అలసట తీరగానే తిరిగి బయల్దేరుతూ ఉంటారు. వానర సేనల ఉత్సాహాన్ని చూసిన రామలక్ష్మణులకు విజయం తమని తప్పక వరిస్తుందనే నమ్మకం కలుగుతుంది.
ఇక రామలక్ష్మణులు బయల్దేరిన సమయంలోనే అక్కడ లంకాధీశుడు అయిన రావణుడికి అశుభ శకునాలు గోచరిస్తాయి. దాంతో ఆయన మరింత ఆందోళన చెందుతూ ఉంటాడు. తనకి ఎదురవుతున్న అశుభ శకునాలు సీత విషయానికి చెందినవేనా? లేదంటే తాను అలా భ్రమపడుతున్నానా? అనే సందేహంలో ఆయన ఊగిసలాడుతూ ఉంటాడు. రాముడి పరాక్రమాన్ని గురించి హనుమంతుడు, విభీషణుడు తనకి ఎక్కువగా చెప్పడం వలన, తాను ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన అలా అనిపిస్తోందని సరిపెట్టుకుంటాడు.
అశోకవనంలో సీతాదేవి రాముడి గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. హనుమంతుడు వెళ్లి తన చూడామణిని రాముడికి ఇచ్చేవుంటాడు. అది చూసిన రాముడు ఎంతో ఆవేదనకు లోనయ్యే ఉంటాడు. తనని తీసుకెళ్లడానికి ఈ పాటికి బయల్దేరే ఉంటాడని భావిస్తుంది. తనకి కొన్ని శుభశకునాలు కలగడానికి కారణం అదేనని అనుకుంటుంది. రామలక్ష్మణులు వానరవీరుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని సీతమ్మ మనసులోనే దైవాన్ని ప్రార్ధిస్తుంది. వానర సమూహాలతో చాలా దూరం ప్రయాణించిన రామలక్ష్మణులు సముద్రతీరానికి చేరుకుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 44 : Rama Lakshmana moves forward with Vanara sena
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.