శ్రీరాముడు నడయాడిన క్షేత్రాలను దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. రామాయణంలోని ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే ఆనందం .. అనుభూతి వేరు. అలాంటి క్షేత్రాలలో “రామేశ్వరం” ముందు వరుసలో కనిపిస్తుంది. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో రామేశ్వరం ఒకటిగా చెప్పబడుతోంది. ఇది రామానంతపురం జిల్లా పరిధిలో వెలుగొందుతోంది. రామాయణంతో ముడిపడిన అనేక ఘట్టాలను ఇక్కడ మనసుతో దర్శించి తరించవచ్చు.

సీతాదేవిని అపహరించిన రావణాసురుడు ఆమెను తన లంకా నగరంలో దాచాడు. రావణుడిని సంహరించడానికి లక్ష్మణుడితోను .. వానర సైన్యంతోను బయల్దేరిన రాముడు, ఇప్పటి “రామేశ్వరం” నుంచే సముద్రాన్ని దాటడం జరిగింది. రావణుడిని సంహరించిన అనంతరం సీతాదేవిని తీసుకుని తిరిగి వచ్చే సమయంలో, రావణ హత్యా పాతకం నుంచి విముక్తిని పొందడం కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ ప్రతిష్ఠకు కైలాసం నుంచి శివలింగం తీసుకురమ్మని రాముడు చెబితే హనుమంతుడు కాస్త ఆలస్యంగా తీసుకుని వచ్చాడట.

ముహూర్త సమయం మించిపోతుందనే ఉద్దేశంతో సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఆ తరువాత శివలింగాన్ని తీసుకొచ్చిన హనుమ .. రాములవారిపై అలగడంతో ఆ సమీపంలోనే ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేశాడట. ఆయన తెచ్చిన శివలింగానికి ప్రధమ పూజ జరుగుతుందని మరీ సెలవిచ్చాడట. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం .. రామలింగేశ్వరుడిగా .. హనుమ తెచ్చిన శివలింగం విశ్వలింగమని పిలవబడుతూ ఉంటుంది. రామలింగేశ్వరస్వామితో కలిసి “పర్వతవర్ధిని” అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది.

రామేశ్వర క్షేత్రాన్ని చూడగానే ఈ క్షేత్రం యొక్క ప్రాచీన వైభవం ఎలాంటిదో అర్థమైపోతుంది. పొడవైన ప్రాకారాలు .. ప్రాకార మంటపాలు .. ఎత్తైన గోపురాలు .. పవిత్రమైన తీర్థాలు దర్శనమిస్తాయి. 12వ శతాబ్దం నుంచి ఈ ఆలయ వైభవానికి ఆయా రాజ వంశీకులు తమవంతు కృషి చేస్తూ వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. వాళ్లంతా కూడా రామలింగేశ్వరుడిని తమ ఇష్టదైవం గా భావించి ఆరాధించినట్టుగా చరిత్ర స్పష్టం చేస్తోంది.

ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి .. అక్కడికి వెళ్లిన భక్తులు ఆయా తీర్థాలలో స్నానమాచరిస్తూ ఉంటారు. ఒక్కో తీర్థానికి ఒక్కో ప్రత్యేకత .. ఒక్కో విశేషం ఉన్నాయి. ఇక ఇక్కడి “గంధమాదన పర్వతం”పై రాములవారి పాదుకలను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ గంధమాదన పర్వతంపై హనుమంతుడు ఇప్పటికీ ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. “మహా శివరాత్రి” పర్వదినం సందర్భంగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు .. ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్ర దర్శనం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు భావిస్తుంటారు.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.