Sri Bhagavatam – Sacrifice of Balarama’s body
సాంబుడు తన స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండటం కృష్ణుడు గమనిస్తాడు. విషయమేమిటని ఆయన అడుగుతాడు. మహర్షులను తాము ఆటపట్టించడం .. తమకి జరిగిన అవమానానికి వాళ్లు ఆగ్రహించడం .. “ముసలం” కారణంగా యాదవులంతా నశిస్తారని శపించడం గురించి చెబుతారు. ఇంతలోనే “ముసలం” పుట్టడం జరిగిపోయిందంటూ ఆ ముసలం చూపుతారు. అది చూసిన కృష్ణుడికి విషయం అర్థమవుతుంది. ఆ ముసలాన్ని బాగా అరగదీసి .. ఆ తరువాత పొడిగా చేసి సముద్రంలో కలిపేయమని కృష్ణుడు చెబుతాడు.
అదే సమయంలో బలరాముడు అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని కృష్ణుడిని అడుగుతాడు. ఆ పిల్లలను అక్కడి నుంచి పంపించి వేసిన కృష్ణుడు, గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనీ, అందుకు మహర్షుల శాపం కూడా తోడైందని కృష్ణుడు చెబుతాడు. యాదవులందరినీ నశింపజేయడానికి ముసలం పుట్టిందని అంటాడు. కాలం తన పని తాను చేసుకుంటూ వెళుతోందనీ, ఇక తమ ప్రయాణం చివరిదశకు చేరుకుందని చెబుతాడు. ఆ మాటలకు బలరాముడు నిట్టూర్చుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
సాంబుడి స్నేహితులంతా ఆ రోకలిని తీసుకుని సముద్ర తీరానికి వెళతారు. ఆ రోకలిని ఒక కొండరాయికి రుద్దుతూ అరగదీయడం మొదలు పెడతారు. చాలావరకూ ఆ రోకలిని అరగదీసిన తరువాత, దానిని నలగ్గొడతారు. అయితే అది చాలా బలంగా ఉండటంతో సన్న పుల్లలుగా అవుతుందే తప్ప, పొడిగా మాత్రం కాదు. అప్పటికే వాళ్లలో ఓపిక నశించడంతో నలగ్గొట్టిన ఆ రోకలి పుల్లలు సముద్రంలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే వాళ్లు చేసిన పొరపాటు అవుతుంది.
ద్వారకలోని ప్రజల ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. జంతువులు .. పక్షులు అన్నీ కూడా తమ సహజ ధోరణికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సముద్రంలోని కెరటాలు ఎప్పటికంటే ఎక్కువగా ఎగసి పడుతూ ఉంటాయి. ఆకాశంలోని మబ్బులు ఎప్పుడూ ఎరుగని కొత్త రంగుని సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. మారుతున్న పరిణామాలను బలరాముడు అర్థం చేసుకుంటాడు. అన్ని భావాలకు అతీతంగా ముందుకు నడుస్తూ సముద్రంలోకి సాగుతూ దేహత్యాగం చేస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Sacrifice of Balarama’s body