Shirdi Sai Baba Temple

శిరిడీ సాయిబాబా .. దత్తావతారాలలో ఒకరిగా .. ఆ గురు పరంపరలో ఒకరుగా చెబుతుంటారు. బాబా తన పాద స్పర్శచే పునీతం చేసిన ఆనాటి “శిరిడీ”(Shirdi) గ్రామం .. ఈ రోజున ఒక పట్టణం. ఇది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో దర్శనమిస్తుంది. అప్పట్లో బాబా ఎక్కడి నుంచి వచ్చాడో .. ఆయన తల్లిదండ్రులు ఎవరో .. ఏ కులానికి చెందినవాడో ఎవరికీ తెలియదు. ఆయన ఆ విషయాలను గురించి ఎప్పడూ ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఆయనకి తెలిసినదల్లా అపారమైన ప్రేమను పంచడమే.

బాబా ఎప్పుడూ గురువును ఆశ్రయించమనే చెప్పారు. ఆయన ఎలాంటి ప్రవచనాలు చెప్పేవారు కాదు. అలాగే ఎవరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నమూ చేయలేదు. మంచి మనసుకు .. మానవత్వానికి మించిన సంపద లేదు అన్నట్టుగానే ఆయన జీవితం కొనసాగింది. ఒక పాత మశీదులో నివసిస్తూ .. దానిని “ద్వారకామాయి”గా భావిస్తూ .. తాను భిక్ష చేసిన దానిలో కొంత మూగజీవాలకు కూడా పెడుతూ .. సంతృప్తికి మించిన సంపద లేదని చెప్పిన మహనీయుడు ఆయన. మూగజీవాలకు ఆహారాన్ని అందించి తన కడుపునిండిందని చెప్పినవారాయన.

బాబాకి ఆ గ్రామంలో బాయిజా బాయి .. తాత్యా .. మహల్సాపతి .. లక్ష్మీబాటు షిండే .. ఇలా కొంతమందితో ఆయనకి ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. వాళ్లంతా కూడా బాబాను తమ కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకునేవారు. ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతూ వస్తే .. బాబా “ధుని”లోని “ఊది”ని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ ఊది కారణంగానే అందరి వ్యాధులు .. బాధలు నయమైపోయేవి. దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాలవారంతా వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్లేవారు. తన కోసం ఎవరు ఏది తెచ్చినా .. అక్కడున్న వాళ్లందరికీ పంచేసి అప్పుడు తాను తినేవారు.

తనకి శాస్త్రాలపై మంచి పట్టు ఉందనీ .. బాబాకి ఏమీ తెలీదనుకున్న ఒక వ్యక్తి అహంభావాన్నీ .. తనకి కండబలం ఉన్న కారణంగా బాబాపై దాడి చేయాలనుకున్న వ్యక్తి అహంభావాన్ని అణచివేసినవారాయన. బాబా ఎప్పుడూ ఎవరి ముందూ కూడా సిద్ధులు .. మహిమలు చూపించేవారు కాదు. తనని నమ్మినవారిని ఆయన కాపాడిన సంఘటనలను భక్తులు మహిమలుగా చెప్పుకున్నారు. ఎక్కడో ఉన్న తనవాళ్లను బాబా కాపాడిన తీరు .. అందుకు సంబంధించిన సంఘటనలు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ తాను ఉన్నాననే నిదర్శనాలు ఆయన చూపుతూనే వస్తున్నాడు.

ఒకసారి తన దేహాన్ని వీడి .. మూడు రోజుల తరువాత తిరిగి తన దేహంలోకి ప్రవేశించినవారయన. ఎవరికీ ఏ దైవం ఇష్టమో ఆ రూపంలో దర్శనమిచ్చినవారాయన. తన భక్తుల ఆహ్వానాలను కాదని చిన్నబుచ్చకుండా అందరి ఇళ్లకు ఒకే సమయంలో వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించినవారాయన. కులమతాలకు అతీతంగా ఉత్సవాలను జరిపించినవారాయన. అహంభావాన్ని విడిచిపెట్టి ప్రకృతిని .. పసి పిల్లలను ప్రేమించమని చెప్పినవారాయన. నీళ్లతో దీపాలు వెలిగించినవారాయన.

ఇప్పటికీ శిరిడీ వెళితే అప్పట్లో బాబా ఉపయోగించిన వస్త్రాలు .. వస్తువులు అక్కడి మ్యూజియంలో చూడొచ్చు. ఆయన వాడిన “తిరగలి”ని చూడొచ్చు. అందులోనే కదా ఆయన పిండి విసిరి “కలరా”ను కట్టడి చేసింది అనిపిస్తుంది. ద్వారకామాయి .. చావడి .. లెండీ వనం .. “ధుని” ఇలాంటి వన్నీ చూస్తుంటే, ఇక్కడే కదా బాబా తిరుగాడినాడు అనుకుంటూ అక్కడి నేలను కళ్లకు అద్దుకోవాలనిపిస్తుంది. బాబా మూర్తిని చూసినప్పుడు కూడా .. ఆయన దగ్గరుండి ఆ శిల్పితో చేయించిన మూర్తికదా అని ఆ రూపాన్ని మనసులో బంధించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. బాబా అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన చెప్పినట్టుగా నడచుకోవడమే మొదటి మార్గం.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Shirdi Sai Baba Temple