Sri Bhagavatam – Ravana abducts Sita Devi

రావణుడు జంగమదేవర వేషంలో ఆశ్రమంలోకి వచ్చి సీతాదేవిని భిక్ష అడుగుతాడు. ఆశ్రమంలో లక్ష్మణుడు గీసిన రేఖను రావణుడు చూస్తాడు. ఆ రేఖను తాను దాటలేనని గ్రహిస్తాడు. సీతాదేవి ఆ రేఖ దాటుకుని బయటికి వచ్చేలా చేయాలని నిర్ణయించుకుంటాడు. సీతాదేవి భిక్ష తీసుకుని వస్తుంది. మరికాస్త ముందుకు వచ్చి భిక్ష వేయమని రావణుడు అడుగుతాడు. దాంతో సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుతుంది. తన చేతిలోని భిక్షను జంగమదేవర వేషంలో ఉన్న రావణుడి జోలెలో వేయబోతుంది. దాంతో ఒక్కసారిగా జంగమదేవర వేషం నుంచి ఆయన రావణుడిగా మారిపోతాడు.

జంగమదేవర వేషంలోని రావణుడు పెద్దగా నవ్వడంతో సీతాదేవి భయంతో కంపించిపోతుంది. వచ్చిన మాయావి ఎవరు? ఏం జరగబోతోంది? అనే విషయాన్ని సీతాదేవి గ్రహించేలోగానే, ఆమె నిలబడిన నేలను పెళ్లగించి తన మాయాశక్తితో ఆకాశ మార్గాన తీసుకెళ్లడం మొదలుపెడతాడు. సీతాదేవి ఎంతగా అరిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. రాక్షస మాయను అర్థం చేసుకుని వెనుదిరిగిన రాముడికి లక్ష్మణుడు ఎదురుపడతాడు. తన మాట వినకుండా లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి రావడం రాముడికి ఆందోళన కలిగిస్తుంది.

రామలక్ష్మణులు వడివడిగా తమ ఆశ్రమానికి చేరుకుంటారు .. సీతాదేవి కనిపించకపోవడం .. అక్కడ నేలను పెళ్లగించిన ఆనవాళ్లు కనిపించడం చూసి అయోమయానికి లోనవుతారు. సీతాదేవి కోసం ఆ పరిసరాల్లో వెదకడం మొదలు పెడతారు. ఆకాశ మార్గాన రావణుడు సీతాదేవిని తీసుకెళ్లడం చూసిన “జటాయువు” అనే పక్షిరాజు, రావణుడిపై దాడి చేస్తుంది. పదే పదే తనని చీకాకు పరుస్తున్న జటాయువు రెక్కలను రావణుడు ఖండిస్తాడు. దాంతో జటాయువు అక్కడి నుంచి కుప్పకూలిపోతుంది.

సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు అక్కడికి చేరుకుంటారు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్న జటాయువును చూస్తారు. లంకానగరాధిపతినే సీతాదేవిని అపహరించాడని జటాయువు చెబుతుంది. ఆయన ఏ దిశగా సీతాదేవిని తీసుకెళ్లింది వివరించి ప్రాణాలను వదులుతుంది. రామలక్ష్మణులు జటాయువుకి అంత్యక్రియలు జరిపించి, అక్కడి నుంచి ముందుకు వెళతారు. అలా నడుస్తూ వాళ్లు “ఋష్యమూక పర్వతం” దగ్గరికి చేరుకుంటారు. ఆ పర్వతంపై సుగ్రీవుడు నివాసం ఉంటూ ఉంటాడు. ఆయన మంత్రిగా హనుమంతుడు ఉంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Ravana abducts Sita Devi