Sri Bhagavatam – Sita leaves everyone and goes to her mother Bhudevi

రాముడితో యుద్ధానికి లవకుశులు సిద్ధమయ్యారనే విషయం తెలిసి, సీతాదేవి ఆందోళన చెందుతుంది. వాల్మీకి ఆశ్రమం నుంచి పరుగు పరుగునా అక్కడికి చేరుకుంటుంది. రాముడితో యుద్ధానికి సిద్ధపడిన లవకుశులను వారిస్తుంది. సీతాదేవిని చూసిన రాముడు .. ఆ పిల్లలు తమ పిల్లలని తెలుసుకుని ఆనందంతో పొంగిపోతాడు. ప్రేమానురాగాలతో వాళ్లను అక్కున చేర్చుకుంటాడు. సీతారాములు తమ తల్లిదండ్రులని తెలుసుకుని వారి పాదాలకు లవకుశులు .. నమస్కరించుకుంటారు.

రాముడి సన్నిధికి లవకుశులను చేర్చేవరకూ తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించాలని అనుకున్నట్టుగా సీతాదేవి చెబుతుంది. తన బాధ్యత తీరిందనీ .. ఇక తాను తన తల్లి ఒడికి చేరుకుంటానని అంటుంది. ఆర్తితో ఆమె పిలవగానే అక్కడి నేల ఒక్కసారిగా రెండుగా చీలుతుంది. అందులో నుంచి భూదేవి పైకి వస్తుంది. సీతాదేవి పరుగున వెళ్లి తన తల్లి ఒడిలో కూర్చుంటుంది. భూదేవి లోపలికి వెళ్లిపోవడం .. అక్కడి భూమి తిరిగి యధావిధిగా మూసుకుపోవడం జరుగుతుంది.

ఊహించని ఈ సంఘటనకు రాముడు నివ్వెరపోతాడు. లవకుశులు కూడ బిత్తరపోతారు. ఆమె కోసం వాళ్లు ఆరాటపడుతుండటం చూసి వాల్మీకి మహర్షి ఓదార్చుతాడు. వాల్మీకి మహర్షి దగ్గర సెలవు తీసుకుని .. లవకుశులను వెంటబెట్టుకుని రాముడు అక్కడి నుంచి బయల్దేరతాడు. అలా ఆయన అయోధ్య నగరానికి చేరుకుంటాడు. సీతాదేవి తీసుకున్న నిర్ణయం గురించి తెలిసి కౌసల్యాదేవితో సహా అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. అయోధ్య ప్రజలు ఆవేదన చెందుతారు.

సీతాదేవి ఎడబాటును అతికష్టం మీద భరిస్తూ, రాముడు తన కర్తవ్యంపై దృష్టిపెడతాడు. ఒక వైపున ప్రజారంజకంగా పాలనను అందిస్తూ .. మరో వైపున లవకుశులను మహావీరులుగా తీర్చిదిద్దుతాడు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడికి తోడుగా ఉంటూ, పరిపాలన సంబంధమైన విషయాలలో తనవంతు సహాయ సహకారాలను అందిస్తుంటాడు. రాముడు అనేక ధర్మకార్యాలను .. లెక్కకు మించి యజ్ఞయాగాలను నిర్వహిస్తాడు. అలా శ్రీరాముడి పరిపాలన జనరంజకంగా జరుగుతూ ఉంటుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Sita leaves everyone and goes to her mother Bhudevi