Sri Aprameya Swamy Temple Mallur

విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు “అప్రమేయ” అనే నామం వస్తుంది. అలాంటి నామంతో శ్రీమన్నారాయణుడు పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం ఒకటి ఉంది .. అదే “మళూరు”(Mallur). బెంగుళూరు – మైసూరు మార్గంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. శ్రీదేవి – భూదేవి సమేతుడైన స్వామి, అప్రమేయుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉండటం విశేషం. ఎందుకంటే ఈ నామంతో స్వామివారు కొలువై ఉండటం మనం ఇంకెక్కడా చూడం.

ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. మహర్షులు .. మహాభక్తులు తిరుగాడిన పుణ్యస్థలి అది అని తెలియగానే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎంతోమంది భక్తులు స్వామి లీలావిశేషాలను గానం చేసి తరించారని తెలిసినప్పుడు, వారి పాదాలు స్పర్శించిన ప్రదేశాలను తాకాలనిపిస్తుంది. యుగాల నాటి చరిత్రను కలిగిన ఈ క్షేత్ర దర్శనం కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే కలుగుతుందని అనిపిస్తుంది.

ఈ ఆలయాన్ని చూడగానే చరిత్ర – ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయి కనిపిస్తాయి. ఈ ఆలయ ప్రాచీన వైభవం ఎంతటిదో అర్థమవుతుంది. గాలి గోపురం .. ప్రాకారాలు .. మంటపాలు .. స్వామివారి ఉత్సవాల్లో ఉపయోగించే వాహన సేవలు చూసినప్పుడు ఈ ఆలయం ఎంతటి ఘన చరిత్రను కలిగి ఉందనేది అర్థమవుతుంది. కృతయుగం నుంచే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడి స్వామిని సేవించాడని అంటారు.

ఇక్కడి కృష్ణుడి విగ్రహాన్ని చూడవలసిందే. వ్యాస మహర్షి ఈ బాలకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడని చెబుతారు. వెన్నముద్ద పట్టుకుని మోకాళ్లపై పాకుతున్నట్టుగా కనిపించే ఈ తరహా బాలకృష్ణుడి ప్రతిమ ఇదొక్కటేనేమో అనిపిస్తుంది. బాలకృష్ణుడి కనుముక్కు తీరు చూస్తూ మంత్ర ముగ్ధులు కావడం ఖాయం. ఈ స్వామి మహిమాన్వితుడనడానికి ఇక్కడ జరిగిన అనేక సంఘటనలు చెబుతుంటారు. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన చాలాకాలం వరకూ ఆ రూపంలో మనసులో మెదులుతూనే ఉంటుందని అంటారు.

వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు .. సేవలు జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వాహన సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక ఇక్కడి రథోత్సవం చూడటానికి రెండు కళ్లు చాలవని అంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరతాయనీ, సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అనేక విశేషాలు సమాహారంగా కనిపించే ఈ క్షేత్రం తప్పక దర్శించవలసినదిగా చెప్పచ్చు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Sri Aprameya Swamy Temple Mallur