Srivilliputhur Andal(Godadevi) Temple
భగవంతుడిని ప్రేమిస్తూ .. ఆరాధిస్తూ .. ఆయన ఆలోచనలతోనే అనుక్షణం గడుపుతూ .. ఆ స్వామిని భర్తగా భావిస్తూ .. చివరికి ఆయనను భర్తగా పొందిన ఒక భక్తురాలి క్షేత్రంగా “శ్రీ విల్లిపుత్తూరు” కనిపిస్తుంది .. ఆ భక్తురాలే “ఆండాళ్(గోదాదేవి)”. తమిళనాడు రాష్ట్రం .. “మధురై”కి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడే విష్ణు చిత్తుడు అనే విష్ణు భక్తుడికి తులసివనంలో గోదాదేవి పసికందుగా లభిస్తుంది. ఆయన ఆ పాపకి “గోదా” అనే నామకరణ చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు.
ఊహతెలిసిన దగ్గర నుంచి గోదాదేవికి రంగనాథుడి నామస్మరణమే. తండ్రి స్వామివారి కోసం పూల మాలలు కట్టి ఆలయానికి తీసుకుని వెళ్లి .. స్వామివారికి అలంకరణ చేసేవాడు. స్వామిపట్ల ప్రేమభావనతో ఆమె తానే ఆ మాలలు కట్టేసి .. ఒకసారి తాను ధరించి .. ఆ మాలలనే తండ్రితో ఆలయానికి పంపించేది. ఒకసారి ఒక పూలమాలలో ఆమె తల వెంట్రుక చూసిన విష్ణుచిత్తుడు ఆమెపై ఆగ్రహిస్తాడు. ఇకపై ఆమె మాలలు కట్టవలసిన అవసరం లేదని చెబుతాడు. తానే మాలలు కట్టి భగవంతుడికి సమర్పిస్తుంటాడు.
అప్పుడు స్వామి .. గోదాదేవి మాత్రమే తనకి మాలలు సమర్పించాలని .. ఆమె ధరించిన మాలలను ధరించడమే తనకి ప్రీతికరమని విష్ణుచిత్తులవారికి స్వప్నంలో చెబుతాడు. స్వామివారి పట్ల గోదాదేవి ఆరాధనా భావాన్ని విష్ణు చిత్తుడు అర్థం చేసుకుంటాడు. ఆ ఆరాధనా భావమే ఆమెను రంగనాథస్వామి సన్నిధికి చేరుకునేలా చేస్తుంది .. ఆ స్వామితో పాటు పూజాభిషేకాలు అందుకునేలా చేయగలిగింది. స్వామివారిని స్తుతిస్తూ ఆమె రాసిన “పాశురాలు” ఓ అద్భుతం. అవే ఆమెకి పన్నెండు మంది ఆళ్వారులలో స్థానం దక్కేలా చేయగలిగాయి.
ఇక్కడి ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది. ఎత్తయిన గోపురం .. పొడవైన ప్రాకారాలు .. అనేక ఉపాలయాలు .. విశాలమైన మంటపాలు .. స్థంభాలపై మలచిన శిల్పాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. విల్లి – పుత్తర్ అనే సోదరులు స్వామివారి స్వయంభూ మూర్తిని ఆయన ఆదేశం మేరకు కనుగొని ఇక్కడ ప్రతిష్ఠించడం వలన, ఈ క్షేత్రానికి “విల్లిపుత్తూరు” అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. పాండ్య .. చోళ .. విజయనగర రాజులు ఈ క్షేత్ర వైభవానికి తమవంతు కృషి చేసినట్టుగా ఇక్కడ ఆధారాలు కనిపిస్తాయి.
గర్భాలయంలోని స్వామి “వటపత్రశాయి”గా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ స్వామినే ఇక్కడివారు “రంగమన్నార్” అని పిలుచుకుంటూ ఉంటారు. ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవాలు .. సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనే విష్ణు చిత్తులవారికి గోదాదేవి లభించిన ప్రదేశాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇక్కడ అమ్మవారు పసిపాపగా దొరికింది .. ఇక్కడ అమ్మవారు తిరిగింది అనే ఆలోచన చేసినప్పుడు కలిగే ఆనందం వేరు .. అనుభూతివేరు. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త శుభాలు చేకూరతాయనేది భక్తుల విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.