Srisailam Bhramarambha Mallikarjuna Swamy Temple

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా “శ్రీశైలం” కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. నంద్యాల జిల్లాలోని కృష్ణా నదీ తీరంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడుగా .. అమ్మవారు భ్రమరాంబిక దేవిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. యుగాల చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. దేవతలు .. మహర్షులు స్వామివారిని సేవించినట్టుగా పురాణాలలో కనిపిస్తుంది. పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు, ఇక్కడ వారు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతున్న శివలింగాలు కనిపిస్తాయి. ఇక త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

శ్రీశైలం క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండటం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం శిలాదుడు అనే మహర్షి శివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. తనకి ఇద్దరు కుమారులను ప్రసాదించమనీ .. తన వలె వారు కూడా మహా శివభక్తులుగా ఉండాలని కోరతాడు. శివానుగ్రహంతో ఆయనకి కలిగిన కుమారులే “నంది” .. ” పర్వతుడు”. మహాశివభక్తుడైన నంది శివుడి వాహనంగా మారిపోతాడు.

ఇక పర్వతుడు కూడా శివుడిని గురించి కఠోర తపస్సు చేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందుతాడు. మహాదేవుడు ప్రత్యక్షం కాగా అమ్మవారితో కలిసి తన శిరస్సు పై భాగంలో నివసించవలసిందిగా కోరుతూ తాను పర్వతంగా మారిపోతాడు. ఆ పర్వతమే ఇప్పుడు శ్రీశైలంగా పిలవబడుతోంది. ఇక్కడ స్వామి మల్లికార్జునుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. స్వామికి మల్లికార్జునుడు అనే పేరు రావడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం చంద్రమతి అనే భక్తురాలు అనునిత్యం ఇక్కడి స్వామిని మల్లికా పుష్పాలతో పూజించడం వలన స్వామికి ఆ పేరు వచ్చిందని అంటారు.

ఇక ఇక్కడ అమ్మవారు భ్రమరాంబిక పేరుతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. లోక కల్యాణం కోసం అమ్మవారు “భ్రమర” రూపంలో అరుణాసురుడిని సంహరించడం వలన అమ్మవారికి ఈ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. శ్రీ శైల గోపురాన్ని దర్శించడం వలన మోక్షం లభిస్తుందనీ .. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. స్వామివారిని .. అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు చేకూరతాయని చెబుతారు.

శాతవాహనులు .. విష్ణు కుండినులు .. పల్లవులు .. చోళులు .. చాళుక్యులు .. విజయనగర రాజులు .. రెడ్డి రాజుల కాలంలో ఈ క్షేత్రం వైభవం పెరుగుతూ వెళ్లిందని అంటారు. ఇక్కడి వృద్ధ మల్లికార్జునుడి వెనుక .. ఆయనను చెంచులు అల్లుడుగా భావించడం వెనుక .. సిద్ధరామప్ప కొలను వెనుక .. ఎన్నో ఆసక్తికరమైన కథలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడి ప్రతి రాయి శివలింగమే అనే విషయాన్ని చాటిచెప్పే శ్రీశైలం ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. ఈ క్షేత్రం పరిసరాల ప్రాంతాలలో ఎటు చూసినా ఆ ఆలయాలు .. మందిరాలు .. మఠాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడి స్వామివారిని సేవించి తరించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. కార్తీక మాసంలోను .. శివరాత్రి పర్వదినం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి