Sri Bhagavatam – Vali gets killed .. Rama declares Sugriva as the king of Kishkinda

ఋష్యమూక పర్వతంపై నుంచి రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు, తనని సంహరించమని చెప్పి వాళ్లని వాలి పంపించి ఉంటాడని భావిస్తాడు. భయపడవలసిన పనిలేదనీ .. వాళ్లు ఎవరనేది తాను తెలుసుకుని వస్తానని హనుమంతుడు క్రిందకి వస్తాడు. బ్రాహ్మణుడి వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వాళ్ల వివరాలను .. అటుగా వచ్చిన పనిని గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. రాముడు హనుమంతుడిని గుర్తిస్తాడు .. దాంతో ఆయన పొంగిపోతాడు. ఆ ఇద్దరినీ వెంటబెట్టుకుని పర్వతం పైభాగానికి వెళతాడు.

రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తున్నారని సుగ్రీవుడు తెలుసుకుంటాడు. అదే సమయంలో తనకి దొరికిన కొన్ని ఆభరణాలను హనుమంతుడు వాళ్లకి చూపుతాడు. అవి సీతమ్మ తల్లి నగలేనని లక్ష్మణుడు చెబుతాడు. దాంతో సీతమ్మను అపహరించిన రావణుడు ఆమెను ఏ దిశగా తీసుకువెళ్లాడనేది వాళ్లకి అర్థమవుతుంది. అదే సమయంలో తన సోదరుడైన వాలి వలన తనకి జరిగిన అన్యాయాన్ని గురించి సుగ్రీవుడు చెబుతాడు. సీతాన్వేషణ విషయంలో తనకి సహకరిస్తానంటే, తాను వాలిని సంహరిస్తానని రాముడు మాట ఇస్తాడు.

అందుకు సుగ్రీవుడు అంగీకరిస్తాడు .. రాముడు చెప్పినట్టుగానే వెళ్లి వాలిని యుద్ధానికి పిలుస్తాడు. ఇద్దరి మధ్య ద్వంద యుద్ధం జరుగుతూ ఉంటుంది. చెట్టు చాటు నుంచి బాణం వదిలి వాలిని వధించాలని రాముడు అనుకుంటాడు. కానీ ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఆయన ఆలోచనలో పడతాడు. సుగ్రీవుడు పారిపోయి వచ్చి .. రాముడు దగ్గర తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరూ ఒకేలా ఉండటమే సమస్య అని చెప్పిన రాముడు, మెడలో ఏదైనా మాల వేసుకుని వెళ్లమంటాడు. రాముడు చెప్పినట్టుగానే సుగ్రీవుడు చేస్తాడు.

సుగ్రీవుడు మళ్లీ వెళ్లి వాలిని యుద్ధానికి పిలుస్తాడు. మరింత కోపంతో రగిలిపోతూ వచ్చిన వాలి, ఒక్కసారిగా సుగ్రీవుడిపై విరుచుకుపడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే రాముడు వాలిని తన బాణంతో నేల కూల్చుతాడు. అధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన వాలి .. తనని క్షమించమని కోరుతూ రాముడి పాదాలకు నమస్కరిస్తూ ప్రాణాలు వదులుతాడు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు అతనిని “కిష్కింద”కు రాజును చేస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Vali gets killed .. Rama declares Sugriva as the king of Kishkinda