దేవతలపై దానవులు తరచు యుద్ధాలకు దిగడం మొదలుపెడతారు. ఏ సమయంలో దానవులు యుద్ధానికి వస్తారో తెలియని ఆందోళన దేవతలలో ఉంటుంది. ఎన్నిమార్లు యుద్ధం చేసినా దానవుల సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడం దేవతలను నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. దానవులు బలపడుతుండటం .. తాము బలహీనపడుతుండటం దేవతలు గ్రహిస్తారు. ఈ విషయాన్ని గ్రహించిన దానవులు మరిన్ని మార్లు యుద్ధానికి దిగుతుంటారు. దాంతో దేవతలు ప్రశాంతమైన జీవితానికి దూరమవుతారు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుని తమ పరిస్థితిని చెప్పుకుంటారు.

సముద్రగర్భాన ఉన్న “అమృత కలశం” సాధించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని విష్ణుమూర్తి చెబుతాడు. అయితే ఆ అమృత కలశం దక్కించుకోవాలంటే అందుకు దానవుల సహకారం కూడా అవసరమవుతుందని అంటాడు. అందువలన కొంతకాలం పాటు దానవులతో స్నేహంగా మసలుకుని, ఆ తరువాత సముద్రగర్భ మథనంలో వాళ్ల సహకారాన్ని కోరడమే మంచిదని సూచిస్తాడు. దాంతో ఆ విధంగా చేయడానికి వాళ్లంతా కూడా అంగీకరిస్తారు. స్వామి చెప్పినట్టుగానే దానవులతో స్నేహంగా మసలుకుంటూ ఉంటారు.

దేవతలు బలహీనపడటం వల్లనే తమతో స్నేహంగా ఉంటున్నారని భావించిన బలిచక్రవర్తి, వాళ్లపై దానవులు యుద్ధానికి వెళ్లకుండా ఆపేస్తాడు. అప్పటి నుంచి దేవతలు .. దానవుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు. దానవులు తమ సాన్నిహిత్యాన్ని నమ్ముతున్నారని భావించిన దేవతలు, అప్పుడు అమృతభాండం దక్కించుకునే విషయాన్ని గురించి బలిచక్రవర్తి దగ్గర ప్రస్తావిస్తారు. సముద్రగర్భాన ఉన్న ఆ కలశాన్ని దక్కించుకోవడానికి వాళ్ల సహాయాన్ని కోరతారు. అమృతం తమకి కూడా దక్కాలనీ .. అలా అయితే సహాయం చేయడానికి తమకి అభ్యంతరం లేదని బలిచక్రవర్తి సమాధానమిస్తాడు.

దేవతలు అందుకు అంగీకరిస్తారు .. ఆ మరుక్షణమే రంగంలోకి దిగడానికి దానవులు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తారు. మందర పర్వతాన్ని “కవ్వం”గా చేసుకుని .. “వాసుకి” సర్పాన్ని త్రాడుగా చేసుకుని .. సముద్రగర్భాన్ని చిలకడానికి అంతా కదులుతారు. ముందుగా మందర పర్వతంను సముద్ర గర్భంలోకి దించాలి .. అది ఎలా సాధ్యం? అని అంతా కూడా ఆలోచనలో పడతారు. అది తమకి సాధ్యంకాని పని అనే నిర్ణయానికి వస్తారు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు గరుత్మంతుడు ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సముద్ర గర్భాన వదులుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.