పరమశివుడు అనేక క్షేత్రాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొండ గుహలలో .. సొరంగ మార్గాలలో .. జలపాతాలలో .. సెలయేళ్లలో ఇలా స్వామి తనకి ఇష్టమైన ప్రదేశాలలో ఆవిర్భవించడం కనిపిస్తుంది. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రంగా “గుత్తికొండ బిలం” కనిపిస్తుంది. సదాశివుడు లింగరూపంలో ఆవిర్భవించి, మల్లికార్జునుడుగా పూజలు అందు కుంటున్న ఈ క్షేత్రం .. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దర్శనమిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో “గుత్తికొండ బిలం” గురించి తెలియనివారు దాదాపుగా ఉండరు.

ఈ బిలం ద్వాపరయుగం నుంచి ఉందనడానికి నిదర్శనంగా, ఈ బిలం .. లోక కల్యాణ కారకమైన ఒక సంఘటనకు నిదర్శనంగా నిలిచింది. పూర్వం దేవతలకు .. దానవులకు యుద్ధం జరుగుతూ ఉండేది. దేవతల కోరిక మేరకు “ముచికుందుడు” అనే మహర్షి తన తపోబలం చేత ఆ యుద్ధంలో వారి తరపున నిలుస్తాడు. యుద్ధంలో గెలిచిన దేవతలు ఏ వరం కావాలని ముచుకుందుడిని అడుగుతారు. ఏళ్లపాటు జరిగిన యుద్ధంలో తాను అలసిపోయాననీ, అందువలన తనకి దీర్ఘ నిద్రను ప్రసాదించమని కోరతాడు. తనకి నిద్రాభంగం కలిగించినవారు తన కంటి చూపుతో మసై పోవాలనే వరాన్ని పొందుతాడు.

దేవతలు ఇచ్చిన ఆ వరంతో ముచికుందుడు ఈ బిలాన్ని ఎంచుకుని నిద్రలోకి జారుకుంటాడు. అలా జరిగిన కొంతకాలానికి కృష్ణుడికి “కాలయవనుడు” తలనొప్పిగా తయారవుతాడు. కాలయవనుడిని తాను చంపకూడదు గనుక, ఆయన అంతానికి కృష్ణుడు ఒక పథక రచన చేస్తాడు. కాలయవనుడు యుద్ధానికి రాగా కృష్ణుడు భయపడుతున్నట్టుగా నటించి పరుగందుకుంటాడు. అది నిజమేననుకుని ఆయన వెంటపడతాడు కాలయవనుడు. అలా తనని తరుముకొస్తున్న కాలయవనుడు .. తన వెనుక ఆ బిలంలోకి వచ్చేలా చేస్తాడు.

బిలం లోపలికి ప్రవేశిస్తూనే కృష్ణుడు ఓ పక్కన దాక్కుంటాడు. మరో వైపున దీర్ఘనిద్రలో ఉన్న ముచికుందుడిని కాలయవనుడు చూస్తాడు. కృష్ణుడు మాయావి కనుక … అలా నాటక మాడుతున్నాడని భావించి, ఆవేశంతో వెళ్లి ఒక్క తాపు తంతాడు. దాంతో ఒక్కసారిగా ముచికుందుడు నిద్రలేస్తాడు. “ఎవడురా నాకు నిద్రాభంగాన్ని కలిగించిన మూర్ఖుడు” అంటూ కళ్లు మలచుకుని ఎదురుగా ఉన్న కలయవనుడిని చూస్తాడు. అంతే .. అక్కడే అతను భస్మమైపోతాడు. అలా కాలయవనుడు కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తాడు కృష్ణుడు.

ఆ తరువాత ముచికుంద మహర్షికి దర్శనమిచ్చి ఆయనను అనుగ్రహిస్తాడు. ఇలాంటి ఒక అద్భుతమైన .. పురాణ సంబంధమైన సంఘటనకు సాక్ష్యంగా గుత్తికొండ బిలం కనిపిస్తుంది. ఈ సంఘటన గురించి తెలిసినవారు .. ఇక్కడి మల్లికార్జునుడిని దర్శించుకోవాలనుకునేవారు వస్తుంటారు. అలాగే ఈ ప్రదేశంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని .. గణపతిని .. హనుమంతుడిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. యుగాలనాటి చరిత్రను తనలో దాచుకున్న గుత్తికొండ బిలాన్ని దర్శించుకోవడం వలన, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.