Sri Bhagavatam – Building a bridge .. Hanuman brings mountain for Sanjeevini plant

రామలక్ష్మణులు .. వానర సమూహాలతో సముద్ర తీరానికి చేరుకుంటారు. సముద్రం ఎలా దాటాలా అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తారు. సముద్రుడిని దారి ఇవ్వవలసిందిగా రాముడు అడుగుతాడు. అయినా సముద్రుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, రాముడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. సముద్రిడిపైకే బాణం ఎక్కు పెడతాడు. అప్పుడు సముద్రుడు వస్తాడు. తనపై వారధి నిర్మించడానికి అనువైన మార్గాన్ని చూపుతాడు. నీలుడు .. నలుడు మొదలగు వానరుల సహాయ సహకారాలతో వారధి నిర్మాణం మొదలవుతుంది.

వారధి నిర్మాణం చకచకా జరుగుతూ ఉంటుంది. వానరులంతా చాలా ఉత్సాహంగా వారధి నిర్మాణంలో పాల్గొంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి విభీషణుడు వస్తాడు .. సీతాదేవి విషయంలో హితవు చెప్పడం వలన తనని రావణుడు బహిష్కరించినట్టు చెబుతూ రాముడిని శరణు కోరతాడు. జరగనున్న యుద్ధంలో తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని చెబుతాడు. లంకానగరానికి అతనిని రాజును చేస్తామని రాముడు అంటాడు. వారధి నిర్మాణం పూర్తి కాగానే అంతా కూడా సంతోషంతో దానిని దాటి లంకానగరంలో అడుగుపెడతారు.

రావణుడికి మరో అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు అతని దగ్గరికి అంగదుడిని రాయబారిగా పంపుతాడు. రావణుడి సభామందిరానికి వెళ్లిన అంగదుడు .. తాను వచ్చిన పనిని గురించి చెబుతాడు. రామలక్ష్మణుల శౌర్య పరాక్రమాలను గురించి వివరిస్తాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని సీతమ్మవారిని అప్పగించమని హితవు చెబుతాడు. రావణుడు ఆ మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా, ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు. యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతాడు. అదే మాటను రాముడితో చెబుతాడు అంగదుడు.

ఇక యుద్ధాన్ని మొదలుపెట్టమని రాముడు వానర సమూహాలను ఆదేశిస్తాడు. దాంతో ఒక్కసారిగా రావణుడి సైన్యం పై వానర సమూహాలు విరుచుకుపడతాయి. భీకరమైన ఆ పోరులో రావణుడి సైన్యంలోని మహావీరులు .. మహాయోధులు అంతా కూడా ఒక్కొక్కరిగా నేల కూలుతుంటారు. మేఘనాథుడి కారణంగా లక్ష్మణుడు స్పృహ కోల్పోతే, హనుమంతుడు సంజీవిని మొక్క కోసం పర్వతాన్నే తీసుకొస్తాడు. సంజీవిని వలన లక్ష్మణుడు ఈ లోకంలోకి వస్తాడు. ఆ తరువాత రావణుడి ముఖ్య అనుచరులతో పాటు, సోదరుడైన కుంభకర్ణుడు .. కొడుకైన మేఘనాథుడు కూడా యుద్ధంలో మరణిస్తారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Building a bridge .. Hanuman brings mountain for Sanjeevini plant